తాబేళ్ల పేరిట వసూళ్లు

3 Feb, 2015 00:47 IST|Sakshi
తాబేళ్ల పేరిట వసూళ్లు

శ్రీకూర్మం(గార): సాక్షాత్తు దేవుని ప్రతిరూపంగా భావించే తాబేళ్లను శ్రీకూర్మనాథ దేవస్థానం అధికారులు ఆదాయ వనరుగా మార్చేశారు. వాటి సంరక్షణ పేరుతో భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇది చట్టవిరుద్ధమని తెలిసినా ఖాతరు చేయకుండా ఏకంగా కౌంటర్ పెట్టి విరాళాలు వసూలు చేస్తూ రసీదులు కూడా ఇస్తున్నారు. కూర్మావతారంలో మహావిష్ణువు కొలువైన ఏకైక ఆలయం శ్రీకూర్మంలోని కూర్మనాథాలయం. అందువల్ల దేవుడి రూపమైన తాబేళ్లకు దేవస్థానం ఆవరణలో ఒక పార్కు కూడా ఏర్పాటు చేశారు. శ్రీకూర్మనాధుని దర్శనానికి వచ్చే భక్తులు తాబేళ్ల పార్కును కూడా సందర్శిస్తుంటారు. అలా వచ్చే భక్తుల నుంచి ‘మీ పేరిట తాబేళ్లకు నెలరోజులపాటు ఆహారం సమకూరుస్తామనిరూ. చెబుతూ దేవాదాయ శాఖ సిబ్బంది చందాలు వసూలు చేస్తున్నారు.
 
 వాస్తవానికి ఇక్కడికి వచ్చే భక్తులందరూ తాబేళ్లు ఆహారంగా స్వీకరించి గోంగూర, చిక్కుడు వంటి కూరగాయలను తీసుకొచ్చి పెడుతుంటారు. అయినా తాబేళ్ల పేరిట అధికారులు మళ్లీ చందాలు వసూలు చేసి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. తాబేళ్లను వన్యప్రాణ సంరక్షణ చట్టంలోని షెడ్యూల్-4 జాబితాలో చేర్చారు. ఈ జాబితాలో ఉన్న వన్యప్రాణులను నిర్బంధించడం, పట్టుకొని అమ్మకం, వాటిని ఆదాయ వనరుగా ఉపయోగించడం, వాటి పేరిట ఏ రూపంలోనూ వసూళ్లకు పాల్పడటం నిషిద్ధం. దీన్ని ధిక్కరిస్తే శిక్షార్హులవుతారు.  ఆ మేరకు గతంలో ఈ దేవాలయంలో తాబేళ్లను ఉంచడంపై వివాదం రేగి హైకోర్టు వరకు వెళ్లింది. భక్తులు దేవుని ప్రతిరూపంగా భావిస్తున్నందున తాబేళ్లను ఆలయంలోనే ఉంచి దేవస్థానం ఆధ్వర్యంలో సంరక్షించాలని హైకోర్టు ఆదేశించింది.
 
 కోర్టు సూచనలతో శ్రీకాకుళానికి చెందిన ఓ భక్తుడు ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సాయంతో తాబేళ్లకు పార్కు నిర్మించారు. ఇందులో సముద్ర తీరం మాదిరిగా ఇసుక తిన్నెలతో సహజసిద్ధమైన వాతావరణం ఏర్పాటు చేయడంతో కొన్ని నెలల క్రితం 50కి పైగా తాబేలు పిల్లలు కూడా జన్మించాయి. వీటి ఆహారం, సంరక్షణ కోసం దేవాదాయ శాఖ శ్రీకాకుళంలోని స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నిర్వహణ ఖర్చులకు ఆ సంస్థకు నెలకు రూ.24 వేలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే ఈ ఖర్చును దేవస్థానం నిధుల నుంచి కాకుండా భక్తుల నుంచే సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అందుకోసమే సుమారు నెల రోజుల క్రితం చందాల కౌంటర్ తెరిచారు. దీని ద్వారా నెలవారీ ఖర్చుకంటే రెండురెట్లు ఎక్కువ ఆదాయం వస్తున్నట్టు తెలిసింది.
 
 చట్టరీత్యా ఇలా వసూలు చేయడం తప్పని తెలిసినా అధికారులు తీరు మార్చుకోలేదు. పైగా ఈ సొమ్ము పక్కదారి పడుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు దేవస్థానానికి చెందిన ఓ తాత్కాలిక ఉద్యోగి ఈ కౌంటర్ బాధ్యతలు నిర్వర్తించేవారు. భక్తులకు ఇచ్చే రసీదులో ఒకలా.. రికార్డుల కోసం ఉంచే డూప్లికేట్ రసీదులో ఇంకోలా అంకెలు మార్చి సొమ్ము కాజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కొందరు భక్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో దీంతో స్థానిక ఉద్యోగిని తప్పించి పాలకొండ కోటదుర్గమ్మ ఆలయ ఉద్యోగిని ఈ కౌంటర్‌లో నియమించారు. గత నెలలో హైదరాబాద్ నుంచి వచ్చిన అటవీ శాఖాధికారులు వసూళ్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సూచించినా ఇప్పటికీ ఆ కౌంటర్ కొనసాగుతోంది.
 

మరిన్ని వార్తలు