‘సేవ’పై నిఘా

27 Dec, 2013 02:35 IST|Sakshi
‘సేవ’పై నిఘా
సాక్షి, గుంటూరు :‘స్వచ్ఛంద సేవ’ ముసుగులో ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్న సంస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్‌ఎంపీ, హిమ్, కంట్రీక్లబ్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమ వసూళ్ల దందా తెలిసిందే. ఈ నేపథ్యంలో అటువంటి పేర్లతో కార్య కలాపాలు సాగిస్తున్న సంస్థల వివరాలను రాబట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రెండు రోజుల కిందట ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో స్వచ్ఛంద సంస్థలపై సర్వే ప్రారంభించగా, పోలీసు, ఇంటెలిజెన్స్ సిబ్బంది బోగస్ సంస్థలను గుర్తించే పనిలో ఉన్నారు.జిల్లాలో అధికమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలను పరిశీలిస్తే హైదరాబాద్, ప్రకాశం జిల్లాల తరువాత స్థానం గుంటూరుదే కావడం గమనార్హం. 
 
 ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ చేసిన సర్వే ప్రకారం జిల్లా వ్యాప్తంగా 20,620 స్వచ్ఛంద సంస్థలు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. అయితే  కేవలం నాలుగువేలకు పైగా సంస్థలు మాత్రమే చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిని కొందరు స్వశక్తితో నడుపుతుండగా, మరికొందరు డొనేషన్‌ల ద్వారానే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 16,980 సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే రెన్యువల్‌కు పరిమితమయ్యాయి.శాఖల వారీగా... జిల్లాలో ఇప్పటి వరకు హెల్త్ అర్గనైజేషన్ పేరుతో 1100 స్వచ్ఛంద సంస్థలు, ఎడ్యుకేషన్, రీసెర్చ్ పేరుతో 5,578, కల్చరల్, రిక్రియేషన్ 2,116, సోషల్ సర్వీస్  3,854, ఎన్విరాన్‌మెంట్ 47, హౌసింగ్ డెవలప్‌మెంట్  3 వేలకు పైగా, లా అండ్ అడ్వకేట్ అండ్ పాలిటిక్స్ పేరుతో 8, ఇంటర్నేషనల్ స్థాయిలో  28, రిలీజియన్స్ పేరుతో 574, బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ అండ్ యూనియన్స్ 939, ఇవికాక మరో 5,907 సంస్థలు రిజిస్టర్ అయ్యాయని జిల్లా ప్రణాళిక శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
 
 ఐటీ మినహాయింపునకు... స్వచ్ఛంద సేవా సంస్థలను నెలకొల్పే ఉద్దేశం ఏమైనప్పటికీ వాటిని స్వార ్థప్రయోజనాలకు వాడుకుంటున్న ఉదంతాలు అనేకం. మత సంస్థలు కాకుండా కొందరు రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో పేరొందిన వ్యక్తులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఎవరికివారు సంస్థలు నడుపుతున్నారు. వీరి స్నేహ బంధాలను ఉపయోగించుకుని డొనేషన్‌ల రూపంలో రసీదులు రాయించడం వాటిని ఐటీ రిటర్న్స్‌కు చూపడం పరిపాటిగా మారింది. కొన్ని సంస్థలు గ్రామాల్లో అమాయక ప్రజలను గ్రూపులుగా విభజించి వారితో వాయిదాల పద్ధతిలో డబ్బు కట్టించడం రెట్టింపు  వస్తుందని నమ్మించడం, పర్యటన ప్యాకేజీలంటూ డబ్బులు కాజేయడం జరుగుతూ ఉంది.
 
 జిల్లాలో ఓ సంస్థ వెనుకబడిన వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ ఒక్కో కుటుంబం నుంచి రూ.5 వేలు వసూలు చేసింది. ఆర్‌ఎంపీ, హిమ్ సంస్థల వ్యవహారం గుప్పుమనడంతో ఇళ్లు కట్టిస్తానన్న ప్రతినిధులు కూడా మాయమయ్యారు.రంగంలోకి పోలీస్, రెవెన్యూ యంత్రాంగం .. బోగస్ సంస్థల గురించి ఇప్పటికే గ్రామాల వారీగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేస్తుండగా, పోలీసు ఇంటెలిజెన్స్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. నరసరావుపేట డివిజన్‌లో మొత్తం 5,300 స్వచ్ఛంద సంస్థలు, తెనాలి డివిజన్‌లో 5,538 సంస్థలు రిజిస్టర్ కాగా, వీటిల్లో 1,284 సంస్థలు సేవలు అందిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. మిగిలినవి  కాగితాలకే పరిమితమని అధికారుల అభిప్రాయం.
 

 

>
మరిన్ని వార్తలు