‘భోగాపురం’పై ఏడు సంస్థల ఆసక్తి

17 Oct, 2018 11:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టడానికి ఏడు సంస్థలు తమ ఆసక్తిని తెలుపుతూ బిడ్లను దాఖలు చేశాయని ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ మంగళవారం ‘సాక్షి’కి వెల్లడించారు. జీవీకే, జీఎంఆర్‌లతో పాటు దక్షిణ కొరియాకు చెందిన ఇంచియాన్‌ ఎయిర్‌పోర్టుతో కలసి రిలయన్స్‌ గ్రూపు, జర్మనీకి చెందిన మూనిచ్‌ ఎయిర్‌పోర్టుతో కలసి ఎస్సెల్‌ గ్రూపు (జీగ్రూపు సుభాష్‌ చందర్‌జీ), స్విడ్జర్లాండ్‌కు చెందిన జ్యూరిచ్‌ ఎయిర్‌పోర్టుతో కలసి డూఇట్, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌తో కలసి ఐ ఇన్‌వెస్ట్‌మెంట్, జెర్మనీ ఎయిర్‌ పోర్టు–ఏవీఐ అలయెన్స్‌ కలసి ఎన్‌ఐఐఎఫ్‌ పేరుతో బిడ్లు దాఖలు చేసినట్లు తెలిపారు.

బిడ్ల పరిశీలనకు పదిరోజులు
ఈ బిడ్లను పరిశీలించి ఆయా సంస్థలకు అన్ని అర్హతలు ఉన్నాయా లేదా అని పరిశీలించేందుకు పది రోజుల సమయం పడుతుందని ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఈవో వీరేంద్ర సింగ్‌ తెలిపారు. ఆ తర్వాత అర్హుల వివరాలను వెల్లడిస్తామన్నారు. అర్హత సాధించిన సంస్థలు ఆదాయంలో ఎంత వాటాను ఇస్తాయో తెలపమంటూ రిక్వెస్ట్‌ ఫర్‌ కొటేషన్‌ (ఆర్‌ఎఫ్‌క్యూ) పిలవనున్నట్లు తెలిపారు. ఆర్‌ఎఫ్‌క్యూ దాఖలు చేయడానికి 45 రోజుల సమయం ఇవ్వనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయి తుది కాంట్రాక్టరను ఎంపిక చేయడానికి కనీసం రెండు నెలలకు పైగా  పడుతుందన్నారు.

ఏఏఐ కన్నా ఎక్కువ కోట్‌ చేస్తాయా?
విశాఖ సమీపాన భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు 2016లోనే ప్రభుత్వం టెండర్లను పిలిచింది. మొత్తం మూడు దశల్లో 1.8 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో రూ.4,208 కోట్ల పెట్టుబడి అంచనాతో దీన్ని నిర్మించనున్నారు. వీటిల్లో ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్ట్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) అత్యధికంగా ఆదాయంలో 30.2 శాతం వాటాను ఆఫర్‌ చేయడం ద్వారా టెండరును కైవసం చేసుకుంది.

మరిన్ని వార్తలు