తూర్పుగోదావరిలో ‘కరోనా’ కలకలం

15 Mar, 2020 16:48 IST|Sakshi

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఏడుగురు కరోనా వైరస్‌ అనుమానితులు

సాక్షి, కాకినాడ: ఏపీలో రోజురోజుకు కరోనా అనుమానితులు పెరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయన్న అనుమానాలతో తూర్పుగోదావరి జిల్లాలో ఏడుగురు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోకి చేరారు. రాజమండ్రికి చెందిన రాజీవ్‌రెడ్డి, లోవరాజు కరోనా లక్షణాలతో ప్రభుత్వాసుపత్రిలోకి చేరగా.. వైద్య చికిత్స అందిస్తున్నారు. వైద్యులు వీరి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు రావాల్సి ఉంది. గల్ఫ్‌ నుంచి మలికిపురం వచ్చిన ఒక వ్యక్తికి తొలుత కరోనా లక్షణాలు ఉన్నాయన్నా అనుమానంతో పరీక్షలు చేయగా నెగిటివ్‌ రావడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య  పెరుగుతుండటంతో అదనంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యాధికారులు తెలిపారు. 

కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా ఆందోళనకర పరిస్థితి లేదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 70 అనుమానిత కేసులు నమోదు కాగా..57 కేసులకు సంబంధించిన పరీక్షల్లో కరోనా లేనట్లు నిర్ధారణ అయిందని తెలిపింది.  మరో 12 నమూనాలకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉందని.. ఒక కేసు మాత్రమే పాజిటివ్‌గా నమోదైందని వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు