స్కూల్‌కు వచ్చిన తొలిరోజే విద్యా కానుక

25 May, 2020 02:26 IST|Sakshi

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ఏడు వస్తువులు

యూనిఫామ్, బెల్టులు, షూలు, సాక్స్, పాఠ్యపుస్తకాలు,నోట్‌ బుక్స్, స్కూల్‌ బ్యాగ్‌లు

రూ.650.60 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం 

39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అభ్యసనంలోనే కాకుండా ఆహార్యంలోనూ కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులకు దీటుగా ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. 2020–21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులను కానుకగా అందించనుంది. జగనన్న విద్యా కానుక కింద వీటన్నిటినీ కలిపి కిట్‌ రూపంలో ప్రతి విద్యార్థికి పంపిణీ చేయనుంది.

ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే 7 రకాల వస్తువులను విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్‌  అన్ని ఏర్పాట్లు చేస్తోంది.  విద్యార్థులకు బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. వేరే వాహనాల్లో వచ్చే వారికి అయ్యే ఛార్జీని కూడా చెల్లించనుంది. విద్యార్థి అభీష్టం మేరకు ఆంగ్ల మాధ్యమంలో కూడా బోధన కొనసాగనుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉన్నా ప్రతి తరగతిలో తెలుగు తప్పనిసరిగా ఉంటుంది.

► జగనన్న విద్యా కానుక కింద 3 జతల దుస్తుల వస్త్రం, బెల్టు, ఒక జత షూ, రెండు జతల సాక్స్, పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, స్కూల్‌ బ్యాగ్‌ అందిస్తారు.
► దుస్తుల వస్త్రాన్ని పాఠశాలల పేరెంట్స్‌ కమిటీల ద్వారా విద్యార్థుల తల్లులకు పంపిణీ చేయిస్తారు. ఒక్కో జతకు కుట్టుకూలి కింద రూ.40 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తుంది.
► జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వం 2020–21 విద్యాసంవత్సరానికి రూ. 650.60 కోట్లను వెచ్చిస్తోంది.
► వస్తువుల నాణ్యతలో ఏమాత్రం రాజీ వద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ఆయనే స్వయంగా విద్యార్థులకు అందించే ప్రతి వస్తువునూ క్షుణ్నంగా పరిశీలించారు.
► సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకే నిధుల లభ్యత ఉంటుంది. రాష్ట్రం 40 శాతం, కేంద్రం వాటా 60 శాతం నిధులు కేటాయిస్తాయి. 9, 10 తరగతుల వారికి ఎస్‌ఎస్‌ఏ నిధులు రావు. దీంతో ఆ విద్యార్థులకు అయ్యే వ్యయం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
► ఇటీవలే ఈ విద్యార్థులకు అవసరమయ్యే దుస్తులు, తదితరాల కోసం రూ.80,43,88,866 మంజూరు చేసింది. 
► దీనివల్ల 9, 10 తరగతులకు చెందిన 8,28,369 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.

మరిన్ని వార్తలు