వడదెబ్బతో ఏడుగురు మృతి

26 May, 2015 03:03 IST|Sakshi

యాడికి /కొత్తచెరువు/ ధర్మవరం రూరల్/ ముదిగుబ్బ : జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆది,సోమవారాల్లో మరో ఏడుగురు మృతిచెందారు. యాడికి, కొత్తచెరువు, ధర్మవరం, ముదిగుబ్బ, పుట్లూరు, యల్లనూరు, పెద్దవడుగూరు మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
 
  యాడికి మండలం రామరాజుపల్లికి చెందిన ముప్పగౌని మలిశెట్టి (65) తన బావమరిది కుమారుడి వివాహానికి ముహూర్తం కట్టుకోవడం కోసం ఆదివారం కూడేరుకు వెళ్లాడు. సాయంత్రం అక్కడే ఎండ తీవ్రత వల్ల వాంతులు, విరేచనాలయ్యాయి. స్థానికంగా ఉన్న వైద్యుడితో చికిత్స చేయించుకున్నాడు. అయినా ఫలితం లేకపోయింది. రాత్రి కూడేరులోనే మృతి చెందాడు. మృతదేహాన్నిసోమవారం రామరాజుపల్లికి తీసుకొచ్చారు. మలిశెట్టికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
  కొత్తచెరువు మండలం నారప్పగారిపల్లికి చెందిన హరిజన గెంగన్న (68) గొర్రెల కాపరి. ఆదివారం గొర్రెలను మేతకు తోలుకెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. నీరసంగా ఉందని చెప్పి పడుకున్నాడు. రాత్రి నిద్రలోనే చనిపోయాడు. ఇతని మృతిపై సోమవారం తహశీల్దార్ మోహన్‌దాస్, వైద్యులు విచారణ చేశారు. ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు.
 
  ధర్మవరం మండలం తుమ్మల గ్రామంలో సోమవారం గొర్రెల కాపరి కురుబ గంగన్న(60) వడదెబ్బతో మృతిచెందాడు. మేత కోసం గొర్రెలను తోలుకెళ్లాడు. ఎండ తీవ్రత వల్ల అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
 
  ముదిగుబ్బ మండలం మర్తాడు గ్రామానికి చెందిన రైతు గంగరాజు (60) రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసేవాడు. పాడి పశువులను కూడా జీవనాధారంగా పెట్టుకున్నాడు. వీటి కోసం గడ్డి కోసేందుకు సోమవారం ఉదయం పొలంలోకి వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తిరిగొచ్చాడు. ఎండ వేడిమి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరే చనాలు అధికమయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. తహశీల్దార్ పీవీ రమణ, డాక్టర్ క్రిష్ణయ్య మృతుడి వివరాలు సేకరించారు.  
 
  పుట్లూరు మండలంలోని బాలాపురం గ్రామానికి చెందిన చెరుకూరి తిరుపాలు(60)  సోమవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం తోట వద్దకు వెళ్లాడు. ఎండ వేడిమి ఎక్కవ కావడంతో  ఇంటికి తిరిగొచ్చాడు. తర్వాత అస్వస్థతకు గురయ్యాడు.  రాత్రి ఇంటిలోనే మృతి చెందాడు.
 
  పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన రామగౌని సంజమ్మ(65) ఆదివారం వ్యవసాయ కూలి పనులకు వెళ్లింది. వడదెబ్బకు గురైంది. రాత్రి నుంచి విరేచనాలు అధికమయ్యాయి. సోమవారం పరిస్థి తి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది.
 
 యల్లనూరులో సోమవారం చెంచులప్ప (45) అనే వ్యక్తి వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయాడు. ఇతను కట్టెల కోసమని వెళ్లి సొమ్మసిల్లి పడిపోయాడు. వాంతులు, విరేచనాలు అధికమవడంతో అక్కడున్న కొందరు గమనించి పులివెందులకు తీసుకెళుతుం డగా మార్గమధ్యంలో మరణించాడు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు