గుండె నిండా ఆశ..దారిలో ఆగిన శ్వాస

7 Sep, 2014 00:42 IST|Sakshi
గుండె నిండా ఆశ..దారిలో ఆగిన శ్వాస

 ప్రత్తిపాడు : కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్ మండలం వీరపల్లిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం ప్రత్తిపాడు మండలంలో వేర్వేరు గ్రామాల్లోని రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు మూడేళ్ల క్రితం ప్రత్తిపాడు మండలం పెద్దిపాలేనికి చెందిన  బంధం లోవరాజు, వేములపాలేనికి చెందిన తుట్టా నాగభూషణం కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి.
 
 అక్కడ వేర్వేరు ప్రాంతాల్లో ఇడ్లీలు అమ్ముకుంటూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. నాగభూషణం స్థానిక బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. రుణ మాఫీ కోసం ఆధార్, రేషన్ కార్డు తీసుకురమ్మని చెప్పడంతో నాగభూషణం తన భార్య నాగమణితో కలిసి స్వగ్రామానికి బయలుదేరాడు. పెద్దిపాలేనికి చెందిన బంధం లోవరాజు బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు భార్య కాసులమ్మతో కలిసి వస్తున్నాడు. మరి కొంతమందితో కలిసి ఆర్గానిక్ కెమికల్స్ లోడుతో ఉన్న వ్యాన్‌లో వారు ప్రయాణిస్తున్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో బంధం లోవరాజు (46), తుట్టా నాగభూషణం (45), నాగమణి (40) అక్కడికక్కడే మరణించగా, కాసులమ్మ తీవ్రంగా గాయపడింది.
 
 రెండు గ్రామాల్లో విషాదఛాయలు
 ఈ ప్రమాదం కారణంగా పెద్దిపాలెం, వేములపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఊళ్లో పనులు లేకపోవడంతో.. నాలుగు రూకలు కూడబెడదామని మూడేళ్ల క్రితం ఆయా కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి.లోవరాజు, కాసులమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె లక్ష్మికి వివాహం చేసి, అత్తారింటికి పంపించారు. ఇద్దరు కుమారులు 21 ఏళ్ల రాంబాబు, 19 ఏళ్ల శివ వారి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం కుమారులిద్దరికీ వ్యాపారాన్ని అప్పగించి, బంధువుల ఇంట జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు వారు బయలుదేరారు.
 
 పమాదంలో కుటుంబ పెద్ద లోవరాజు మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటయింది. హైదరాబాద్‌కు వలస వెళ్లిన నాగభూషణం, నాగమణి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు రమణ వారి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. రెండో కుమారుడు మల్లేషు, కుమార్తె దుర్గ స్వగ్రామమైన వేములపాలెంలో పెద తండ్రి సూర్యనారాయణ సంరక్షణలో ఉంటున్నారు. గతంలో తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న ఆశతో, ఆధార్, రేషన్ కార్డును బ్యాంకులో అందజేసేందుకు వారు పయనమయ్యారు. వ్యాపారాన్ని పెద్ద కుమారుడికి అప్పగించి, భార్యాభర్తలు బయలుదేరాడు.
 
 తల్లిదండ్రుల మరణవార్త విని వారి కుమారుడు రమణ, కుమార్తె దుర్గ కుప్పకూలిపోయారు. చాలాకాలం తర్వాత వస్తున్న తల్లిదండ్రులను చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా, వారు ఇక  లేరన్న కబురు అందడంతో వారు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను కోల్పోయి, బోరున విలపిస్తున్న తీరు చూపరులును కంటతడి పెట్టించింది.
 
 డ్రైవర్ అజాగ్రత్తే కారణం
 విజయవాడ సిటీ/వీరవల్లి (హనుమాన్ జంక్షన్ రూరల్) : ఆర్గానిక్ కెమికల్స్ లోడుతో వస్తూ ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పాటు డ్రైవర్ అజాగ్రత్తగా వ్యాన్‌ను నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. నిద్రమత్తుకు లోనైన డ్రైవరు ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్టు వివరించారు. వ్యానులోని కెమికల్ పీపాలు పగిలి ఆవిర్లతో కూడిన పొగ దట్టంగా వ్యాపించింది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు రక్షించేందుకు వెళ్లగా, కళ్లలో మంటలు రావడంతో భయభ్రాంతులకు గురై వెనుదిరిగారు.
 

మరిన్ని వార్తలు