చిన్నారి నందిని ఆచూకీ లభ్యం

29 Jul, 2017 07:20 IST|Sakshi
చిన్నారి నందిని ఆచూకీ లభ్యం

తిరుమల‌(చిత్తూరు జిల్లా): తిరుమలలో కిడ్నాపైన చిన్నారి నందిని ఆచూకీ లభ్యమైంది. శాలినీ అనే మహిళ కిడ్నాప్‌ చేసి చిన్నారిని బెంగుళూరుకి ఎత్తుకెళ్లింది. పోలీసులు కిడ్నాపర్‌ శాలినీని అరెస్ట్‌ చేసి చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాళహస్తికి చెందిన ఏడేళ్ల నందినిని గుర్తుతెలియని మహిళ ఆదివారం కిడ్నాప్‌ చేసింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని అమ్మపాళెంకు చెందిన సురేష్‌ తిరుమ లలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. భార్య దాక్షాయిణి, ఇద్దరు కుమార్తెలు నందిని(7), మహాలక్ష్మి(4)తో కలసి తిరుమలలోనే నివాసం ఉంటున్నాడు. ఈ నెల 23న స్థానిక యాత్రిసదన్‌–4 వద్దకు పెద్దకుమార్తె నందిని తాగునీటికోసం వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు గాలించినా ఆచూకీ లభించక పోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు సేకరించారు. ఆదివారం మధ్యాహ్నం 3.33 గంటలకు నందినిని ఓ మహిళ వెంట తీసుకెళ్తున్నట్టు అక్కడి ఏటీఎం సెంటర్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. 3.50 గంటలకు తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్, సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కూడా సీసీ కెమెరాల్లో నందిని, గుర్తుతెలియని మహిళ నడిచివెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

ఈ ఘటనను టీటీడీ సీవీఎస్‌వో ఏ.రవికృష్ణ, తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి తీవ్రంగా పరిగణించారు. చిన్నారి గాలింపునకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. కిడ్నాప్‌కు పాల్పడిన మహిళ ఫొటోలతో విస్తృత ప్రచారం కల్పించారు. చివరకు నిందితురాలిని అరెస్ట్‌ చేసి చిన్నారిని సురక్షితంగా విడిపించారు.

మరిన్ని వార్తలు