మక్కా పేలుళ్లు జరిగి నేటికి ఏడేళ్లు

18 May, 2014 09:40 IST|Sakshi
మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగిన ప్రాంతం(ఫైల్)

చార్మినార్: పాతబస్తీ మక్కా మసీదులో పేలుడు జరిగి ఆదివారానికి ఏడేళ్లవుతున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 2007 మే 18న మక్కా మసీదులో సంభవించిన పేలుడు ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల దృష్ట్యా పలుచోట్ల ఆదివారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఇక మక్కా మసీదు వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

మక్కా మసీదు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నామని దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రే ష్ట త్రిపాఠీ తెలిపారు. 6 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, 7 ప్లాటూన్ల ఏపీఎస్‌పీ బలగాలతో పాటు దక్షిణ మండలంలోని నలుగురు ఏసీపీలు, 18 పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు ఇతర పోలీసు సిబ్బంది శాంతి భద్రతలను పర్యవేక్షిస్తారన్నారు. అశ్విక దళాలు గస్తీ తిరుగుతున్నాయన్నారు. పాతబస్తీలో నిరసన సభలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు.
 
వెంటాడుతున్న విషాదం...
చార్మినార్ : మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగి ఏడేళ్లైనా.. ఆ నాటి విషాద ఘటన పాతబస్తీ ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. 2007 మే 18న వుధ్యాహ్నం 1.18 గంటలకు బాంబు పేలింది. ఆనాటి ఛేదు జ్ఞాపకాల నుంచి మృతుల కుంటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ప్రాణాలు కోల్పోయిన తమ వారిని ఎన్ని లక్షలు వెచ్చించినా తీసుకు రాలేవు కదా.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి రాష్ర్ట ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష, ఇతరు నుంచి కూడా ఆర్థిక సహాయం అందిందనప్పటికీ... తమ వారు లేని లోటు తీర్చలేనిదంటున్నారు.

బాంబు పేలుడు ఘటన ...తదనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు తమకు తీరని నష్టం జరిగిదంటున్నారు. నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన ఇర్ఫాన్‌షరీఫ్ మృతి చెందడంతో ప్రభుత్వం నుంచి అందిన ఆర్థిక సహాయం అందింది. ఆ డబ్బుతో అతని ఇద్దరు తోబుట్టువుల వివాహాలు చేశారు.

అలాగే మిశ్రీగంజ్‌కు చెందిన అక్రం అలీ ఖాన్ కుమారుడు సాజిద్ అలీఖాన్ మక్కామసీదు బాంబు పేలుడు ఘటనలో మృతి చెందడంతో...అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ. 6 లక్షల ఆర్థిక సహాయం లభించింది. దీంతో ఆమె వచ్చిన డబ్బుతో పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. అటు కుమారుడు లేక...ఇటు కోడలు లేక వయోవృద్ధుడైన అక్రం అలీ నిర్జీవంగా ఇంట్లో కాలం గడుపుతున్నాడు. ప్రస్తుతం తమకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ.... తమ వారు లేని లోటును ఎవరు తీరుస్తారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు