బాధ్యతగా వ్యవహరించకపోతే వేటే!

4 Sep, 2015 04:39 IST|Sakshi
బాధ్యతగా వ్యవహరించకపోతే వేటే!

- ఆర్టీసీ సిబ్బందికి ఆర్‌ఎం హెచ్చరిక
- డీఎంలతో సమీక్షాసమావేశం
పట్నంబజారు(గుంటూరు) :
విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించని పక్షంలో వేటు తప్పదని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తన చాంబర్‌లో గురువారం సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట డిపో మేనేజర్‌లతో సమావేశం నిర్వహించారు. ఇక నుంచి జిల్లావ్యాప్తంగా పదిమందితో కూడిన బృందాలు తిరుగుతాయని, సిబ్బంది, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పక్కన పెట్టాల్సివస్తుందని స్పష్టం చేశారు.

ఆయా డిపోల పరిధిలో బ్రేక్ డౌన్స్ అధికమైపోతున్నాయని, ఎప్పటికప్పుడు బస్సుల స్థితిగతులను చూసుకోవాల్సిన బాధ్యత డీఎంలపైనే ఉందన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి రీజియన్ పరిధిలో జరుగుతున్న ‘బస్సు ప్రయాణ మాసం’లో అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. ప్రతి డిపో మేనేజర్ వారి వారి పరిధిలోని ప్రాంతాల్లో బస్సుల్లో పర్యటిస్తూ ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. ప్రతి ఆదివారం డీఎంలు సూపర్‌వైజర్లతో సమావేశాన్ని నిర్వహించి ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

డ్రైవర్, కండక్టర్‌లకు అభినందనలు
గత నెల 27వ తేదీన శ్రీరామపురం తండా నుంచి ప్రసవం కోసం మాచర్ల బయలుదేరిన అరుణాబాయి బస్సులోనే ప్రసవించింది. ఆ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్ కృష్ణ, కండక్టర్ రహీంలను ఆర్‌ఎం శ్రీహరి అభినందించారు.

మరిన్ని వార్తలు