ఇసుక.. ఇక చవక

5 Sep, 2019 04:37 IST|Sakshi
బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌

నేటి నుంచి నూతన విధానం 

ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు

ఆటో, ట్యాక్సీవాలాలకు 397.93 కోట్ల రూపాయల ఆర్థిక సాయం.. 

శ్రీరామనవమి నుంచి పెంచిన వైఎస్సార్‌ పెళ్లి కానుక.. ఏటా 746 కోట్ల రూపాయలు

పట్టా భూముల్లో రైతుల అనుమతితో ఏపీఎండీసీ తవ్వకాలు

హోదా కోసం పోరాడినవారిపై నమోదైన కేసుల ఎత్తివేత

వైఎస్సార్‌ క్రీడా ప్రోత్సాహకాలకు రూ.5 కోట్లు 

పీవీ సింధుకు కేబినెట్‌ అభినందనలు

ఆంధ్రాబ్యాంకు పేరు అలాగే ఉంచాలని కేంద్రానికి వినతి

టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య 19 నుంచి 25కి పెంపు

బందరు పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాలు వెనక్కి.. పనులు జరగనందువల్లే

నవయుగకు పోలవరం విద్యుత్‌ ప్రాజెక్టు రద్దుకు ఆమోదం

సాక్షి, అమరావతి: ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందచేసే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుకపై కొత్త విధానం గురువారం నుంచి అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త ఇసుక విధానంతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆంధ్రా బ్యాంకు పేరును యథాతథంగా కొనసాగించేలా ప్రధానిని కోరాలని, ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని, శ్రీరామనవమి నుంచి పెంచిన వైఎస్సార్‌ పెళ్లి కానుకను అమలు చేయాలని, జాతీయ పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గం నిర్ణయాలను సమాచార, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ..

ఇసుకపై ఇదీ విధానం..
రాష్ట్రంలో ఇసుక తవ్వకం, రవాణాను ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) చేపట్టనుంది. ఇసుకపై పర్యావరణ హితమైన కొత్త విధానం గురువారం నుంచి అమల్లోకి రానుంది. ప్రజలకు సరసమైన ధరకు ఇసుక లభించేలా కొత్త విధానాన్ని రూపొందించారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే భారీగా ధర తగ్గిస్తూ, పారదర్శకంగా నేరుగా వినియోగదారులకు ఇసుక చేరవేయనున్నారు. బుధవారం నాటికి 13 జిల్లాల్లో 41 స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్టోబరు నాటికి వీటిని 70 నుంచి 80 వరకు పెంచనున్నారు. స్టాక్‌ పాయింట్లను క్రమేణా మరిన్ని పెంచనున్నారు. రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్‌ పాయింట్‌ వద్ద టన్ను ఇసుక  ధర రూ.375గా నిర్ణయించారు. అక్కడి నుంచి రవాణా ఖర్చు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టన్నుకు కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున రవాణా ఖర్చును నిర్థారించారు.

10 కిలోమీటర్ల లోపు వరకు ట్రాక్టర్ల ద్వారా రవాణా ఖర్చు రూ.500గా నిర్ణయించారు. పట్టా భూముల్లో రైతుల అనుమతితో ఇసుక తవ్వకాల బాధ్యతను ఏపీఎండీసీకి అప్పగించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు క్యూబిక్‌ మీటరుకు రూ.60 చొప్పున ఏపీఎండీసీ రైతులకు చెల్లించనుంది. లోడింగ్, తవ్వకాల రూపంలో రైతులపై ఎలాంటి భారం ఉండదు. దీన్ని ఏపీఎండీసీనే భరిస్తుంది. 82 చోట్ల పట్టా భూములను ఎపీఎండీసీ గుర్తించింది. 100 రీచ్‌లను సిద్ధం చేసింది. 31 చోట్ల డీ సిల్టేషన్‌ చేపట్టనుంది. ఇసుక రవాణా చేసే  ప్రతి వాహనానికి జీపీఎస్‌ తప్పనిసరి. రీచ్‌ నుంచి స్టాక్‌ పాయింట్‌కు, స్టాక్‌ పాయింట్‌ నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు వాహనాల్లో జీపీఎస్‌ ఉంటుంది. అనుమతి లేని వాహనాల్లో  ఇసుక రవాణా చేయకూడదు. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాపై నిషేధం విధించారు. 

3.97 లక్షల మంది ఆటో, టాక్సీవాలాలకు రూ.397.93 కోట్ల ఆర్థిక సాయం..
సొంతంగా ప్యాసింజర్‌ ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భార్య, భర్త ఇద్దరినీ ఒకే యూనిట్‌గా పరిగణించాలని, అదే కుటుంబంలో మేజర్‌ కుమారుడు లేదా కుమార్తె ఓనర్‌ కం డ్రైవర్లుగా ఉంటే వారిని వేరే యూనిట్‌గా పరిగణించాలని నిర్ణయించారు. ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, రిపేర్ల కోసం ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారులకు అందించనున్నారు. రాష్ట్రంలో 2019 మార్చి నెలాఖరు వరకు 6.63 లక్షల ఆటోలు, ట్యాక్సీలు ఉన్నట్టు అంచనా. ఇందులో సొంతంగా నడుపుతున్న వాటి సంఖ్య 3.97 లక్షలుగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో 3.97 లక్షల మంది ఆటో, టాక్సీ వాలాలకు ఏడాదికి రూ.397. 93 కోట్ల మేర ఆర్థిక సాయం అందనుంది. అయితే లబ్ధిదారుల సంఖ్య ఇంకా పెరిగినా భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సెప్టెంబరు 10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబరు 4వ వారం నుంచి లబ్ధిదారులకు ఆర్ధిక సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం ఆ రశీదును గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారులకు అందించనున్నారు. 

నవమి నుంచి ‘వైఎస్సార్‌ పెళ్లి కానుక’ పెంపు
శ్రీరామనవమి నుంచి పెంచిన ‘వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక’ను అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పథకం లబ్ధిదారులు దాదాపు 96,397 మంది ఉంటారని అంచనా వేశారు. ఇందుకోసం ఏడాదికి రూ.746.55 కోట్లు ఖర్చు కానుంది. వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక కింద ఎస్సీలకు ఇచ్చే నగదును రూ.40 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. ఎస్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. బీసీలకు రూ.35 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. మైనార్టీలకు రూ. 50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. వికలాంగులకు నగదు కానుకను రూ.లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు పెంచారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ. రూ.20 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఎస్సీలను కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.1.20 లక్షలు, ఎస్టీలను కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 1.20 లక్షలు, బీసీలను కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 70 వేలు చొప్పున ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు. 

మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

నెట్టింట్లో బుక్‌ చేస్తే.. నట్టింటికే వస్తుంది 
ఇసుక బుకింగ్‌ కోసం నేటినుంచి అందుబాటులోకి వెబ్‌సైట్‌
ఇసుక అవసరమైన వారి కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి అందుబాటులోకి తెస్తోంది. sand. ap. gov. in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇసుకను ఎవరైనా బుక్‌ చేసుకోవచ్చు. డబ్బు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుంది. అధిక పరిమాణంలో ఇసుక అవసరమైన వారు బల్క్‌ బుకింగ్‌ అని, వ్యక్తిగత అవసరాలకు కావాల్సిన వారు రిటైల్‌ వినియోగమని పేర్కొనాలి. దీనికోసం ఆధార్‌ కార్డును కూడా నమోదు చేయాలి. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఈ వెబ్‌సైట్‌లో స్టాక్‌ యార్డుల వారీగా ఇసుక నిల్వలను నమోదు చేస్తారు. కావాల్సిన వారు ఆ ప్రకారం బుక్‌ చేసుకోవచ్చు.

స్టాక్‌ యార్డులో లోడింగ్‌తో కలిపి టన్ను ధర రూ.375 చొప్పున ట్రాక్టరు ఇసుక (4.5 టన్నులు యూనిట్‌గా) ధర రూ.1,677.50గా నిర్ణయించారు. కృష్ణా జిల్లా చెవిటికల్లు స్టాక్‌ యార్డులో ఇసుక పంపిణీని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఉదయం 9 గంటలకు ఇసుక సరఫరాను ప్రారంభిస్తారు. ట్రాక్టర్‌ ఇసుక కూడా దారి మళ్లడానికి వీల్లేకుండా, అక్రమ తవ్వకాలు, రవాణాకు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతో రేవులు, స్టాక్‌ యార్డుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రీచ్‌ల నుంచి స్టాక్‌ యార్డు వరకూ ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పర్యవేక్షణలో కాంట్రాక్టర్లు ఇసుక తరలిస్తారు. స్టాక్‌ యార్డుల నుంచి అవసరమైన వారికి వాహనాల్లో ఇసుక సరఫరా చేసే బాధ్యతను ప్రభుత్వం ఏపీఎండీసీకి అప్పగించింది. 

నిబంధనల్ని ఉల్లంఘిస్తే..
నిబంధనల్ని ఉల్లంఘించి ఇసుక రవాణా చేస్తే ట్రాక్టరుకు రూ.10 వేలు, లారీకి రూ.25 వేలు, 10 టన్నులు పైబడి రవాణా చేసే లారీలు, యంత్రాలకు రూ.50 వేలు జరిమానా విధిస్తారు. రెండోసారి నిబంధ నలను ఉల్లంఘిస్తే ట్రాక్టరుకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు, పది టన్నుల లోపు లారీకి రూ.25 వేల నుంచి రూ.50 వేలు, పది టన్నులు పైగా ఉన్న లారీలు, యంత్రాలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష జరిమానా విధిస్తారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  

ఆశా వర్కర్లకు గత సర్కారు మిగిల్చిన రూ.132 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం
ఆశా వర్కర్ల వేతనాలను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.1,500 చొప్పున ఉన్న ఆశావర్కర్ల జీతం 2018 ఆగస్టు నుంచి రూ.3 వేలకు పెంచుతూ, మరో రూ.3 వేలు ప్రతిభ ఆధారంగా ఇస్తామంటూ గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆశావర్కర్ల జీతాలను నేరుగా రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా కేబినెట్‌ ఆమోదించింది. జీతాల రూపంలో వారికి చెల్లించాల్సిన బకాయిలను కూడా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు జనవరి నుంచి జూలై వరకూ బకాయిలు మిగిల్చింది. ఆ బకాయిల కోసం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.132 కోట్లను విడుదల చేయగా తాజాగా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

హోదా పోరుపై కేసుల ఉపసంహరణ
ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూషన్‌ విత్‌డ్రాకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం పీడీ చట్టం కింద కేసులు పెట్టిన విషయం తెలిసిందే. 

వైఎస్సార్‌ క్రీడా ప్రోత్సాహకాలు... సింధుకు అభినందనలు
జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2014 నుంచి 2019 వరకు పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. ఇందుకోసం రూ. 5 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇప్పటివరకు 162 మంది దరఖాస్తు చేసుకున్నారు. బంగారు పతకానికి రూ.5 లక్షలు, వెండి పతకానికి రూ.4 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు నగదు చొప్పున ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. జూనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయిలో పతకాలు సాధించిన వారికి కూడా  నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంఫియన్‌ షిప్‌ సాధించిన పీవీ సింధుకు కేబినెట్‌ అభినందనలు తెలిపింది. 

ఆంధ్రాబ్యాంకు పేరు అలాగే ఉంచాలని వినతి
డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్రాబ్యాంకు పేరును యథాతథంగా ఉంచాలని కేబినెట్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ప్రధానికి సీఎం లేఖ రాయనున్నారు.

డీఆర్డీఓకు 5 ఎకరాలు
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరం వద్ద డీఆర్డీఓకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అక్కడ రాకెట్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను డీఆర్డీఓ ఏర్పాటు చేయనుంది. చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌కు ఇంటర్మీడియట్‌ లెవల్‌ పంపింగ్‌ కోసం సుమారు 25 ఎకరాలు భూమిని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. నడికుడి–శ్రీకాళహస్తి మార్గంలో దేకనకొండ బ్రాడ్‌గేజ్‌ కోసం 20.19 ఎకరాలను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు.

బలిమెల అమరుడి కుటుంబానికి పది సెంట్లు భూమి
బలిమెల ఘటనలో అమరుడైన ఏపీఎస్పీ అధికారి వెంకట్రావు కుటుంబానికి గుంటూరు జిల్లా లాంలో 10 సెంట్ల భూమి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 
– మచిలీపట్నం పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పనులు ప్రారంభించకపోవడంతోనే వెనక్కు తీసుకోవాలని నిర్ణయించారు. 
– టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 19 నుంచి 25 (ఎక్స్‌అఫీషియో సభ్యుడు కాకుండా)కు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.
– మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. 2005 నుంచి మావోయిస్టులపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
– నవయుగకు పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 3,216.11 కోట్ల టెండర్‌ రద్దును కేబినెట్‌ ఆమోదించింది. రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతిలో తాజాగా టెండర్ల ఆహ్వానానికి ఆమోదం తెలిపింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌లు రికవరీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదించింది, నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం మేర ఇచ్చిన రూ.780 కోట్ల మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల రికవరీకి నిర్ణయం తీసుకుంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జీవన ‘కళ’

టన్ను ఇసుక రూ.375, జీఎస్టీ అదనం

పరిటాల వర్గీయుల బరితెగింపు 

వైఎస్‌ చొరవతో సీమకు కృష్ణా జలాలు

టీడీపీ పా‘పాలు’

రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.. డబ్బులు ఎగ్గొట్టారు

చట్టం.. వారికి చుట్టం

మళ్లీ వరద

టీడీపీకి అయ్యన్న సోదరుడి రాజీనామా 

పెయిడ్‌ ఆర్టిస్టులతో జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం

రైస్‌ 'కిల్లింగ్‌'!

చంద్రయాన్‌–2: మూడో ఘట్టం విజయవంతం

మైనింగ్‌ మాఫియాకు మూడినట్టే..!

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

స్థానిక ఎన్నికల తరువాతే నామినేటెడ్‌ పదవులు

యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీ‘ఐ’

ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం

73 ఏళ్ల అమ్మ

ఎల్లుండి శ్రీకాకుళంలో పర్యటించనున్న సీఎం జగన్‌

రేపు విజయవాడకు సీఎం జగన్‌

‘సీఎం జగన్‌ నిర్ణయం హర్షనీయం’

ఈనాటి ముఖ్యాంశాలు

పరిటాల సునీత వర్గీయుల దాష్టికం

'ఒంటరిగానే బలమైన శక్తిగా ఎదుగుతాం'

‘ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన వారిపై కఠిన చర్యలు..

అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని తెలీదా?

‘చంద్రబాబు డీఎన్‌ఏలోనే నాయకత్వ లోపం ఉంది’

ఆర్టీసీ విలీనానికి కేబినెట్‌ ఆమోదం

ఏపీ సీఎంను కలవనున్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!

రెండు అడుగులతో నెట్టింట్లోకి....

మరో రీమేక్‌?

నా మనసుకు నచ్చిన చిత్రమిది

అందమైనపు బొమ్మ