సలక్షణ దోపిడీ

24 Jul, 2015 23:21 IST|Sakshi

 సీతంపేట : నిరుపేద గిరిజనుల అభ్యున్నతికి ఎన్నో పథకాలు అమలు చేయాలనుకుంటున్న ఐటీడీఏ ఆశయానికి తూట్లుపడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పథకాలు సక్రమంగా అమలుకాక గిరిజనాభివృద్ధి నేతి బీరకాయ చందంగా  మారుతోంది. ఉద్యానవన శాఖ ద్వారా ఐటీడీఏ పరిధిలో వివిధ మండలాలకు చెందిన రైతులకు జీడి, మామిడి తోటల పెంపకం ద్వారా వారి ఆదాయాలను మెరుగుపర్చాలని నిర్ణయించారు. వాటి పెంపకానికి కావాల్సిన ఎరువులను సరఫరా చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం రూ. దాదాపు కోటి వరకు నిధులు వెచ్చించారు. అయితే ఆ ఎరువులు, పురుగుల మందులు చాలా మంది రైతులకు పూర్తిస్థాయిలో అందలేదని, అంతంతమాత్రంగానే అందజేసి చేతులు దలుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
 
 సీతంపేట, భామిని, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, మందస, పాతపట్నం మండలాలకు చెందిన రైతులకు జీడి, మామిడి మొక్కలకు తెగుళ్లు రాకుండా ఎరువులు, పురుగుమందులను సరఫరా చే సేందుకు టెండర్‌ద్వారా కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. 6 వేల మంది గిరిజన రైతులను ఎంపిక చేసి 5,600 ఎకరాల్లో మొక్కలు పెంపకానికి గతేడాది చర్యలు తీసుకున్నారు. ఎకరాకు రూ. 3,500లు విలువ చేసే ఎరువులు, పురుగుమందులు, ఇతర క్రిమిసంహారకాలను పంపిణీ చేయాలని ఐటీడీఏ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ చాలా మంది రైతులకు పూర్తిస్థాయిలో అవి అందలేదని రైతులు పేర్కొంటున్నారు. వీటి పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు మండలాల్లోని తహశీల్దార్ ద్వారా కమిటీలను వేసి పంపిణీ చేయాలని అప్పటి పీవో ఎన్.సత్యనారాయణ సంబంధిత అధికారులకు సూచించారు. అయితే వీటి పంపిణీ తహశీల్దార్లకే తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేయడం గమనార్హం.
 
 పంపిణీ చేయాల్సిన సరకు
 నీమ్‌కేక్ 80 కిలోలు, సింగిల్ సూపర్‌ఫాస్పేటు 70కిలోలు, యూరియా 10కిలోలు, పొటాష్ 15కిలోలు, సీవోసీ 500 గ్రాములు, వేపనూనె ఒక లీటరు, క్లోరీఫైరీఫాస్ ఒకలీటరు, ఫార్ములా 7 పదికిలోలు, వర్మికంపోస్ట్ 80 కిలోలు, జీవశిలీంద్రినాశిని కిలో ఇవ్వాల్సి ఉంది. అయితే నీమ్‌కేక్, సింగిల్‌సూపర్ పాస్పేట్, యూరియా వంటివి అక్కడడక్కడా కొద్ది మంది రైతులకు పంపిణీ చేశారు. మరి కొందరికి అసలు పంపిణీ చేయకపోవడం గమనార్హం. పదిరకాలు కాకుండా నాలుగైదు రకాలను పంపిణీ చేసి చేతులు దులుపు కున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంపిణీ చేసిన అరకొర ఎరువులు సైతం కొన్ని గ్రామాల్లో అలానే పడి ఉన్నాయి. రైతులకు వాటిని ఎలా వినియోగించాలి, ఎప్పుడు వినియోగించాలనే అంశాలను కూడా తెలియజేయలేదు. దీంతో ఇవి కూడా కొన్ని చోట్ల మూలన పడ్డాయి. దాదాపు అన్ని మండలాల్లోనూ పంపిణీ ఇలానే జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై హార్టీకల్చర్ ఏపీవో శంకరరావు వద్ద సాక్షి ప్రస్తావించగా అంతమందికీ ఎరువులు, పురుగుమందులు పది రకాలు పంపిణీ చేశామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు