పెథాయ్‌ ఎఫెక్ట్‌ : బస్సులు, విమానాలు రద్దు

17 Dec, 2018 10:52 IST|Sakshi

పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రటించిన అధికారులు

విశాఖ ఎయిర్‌పోర్టులో పలు విమాన సర్వీస్‌లు రద్దు

నిజాంపట్నం పోర్టురేవులో 5వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ

సాక్షి, అమరావతి : తీవ్ర తుపానుగా మారిన పెథాయ్‌ దెబ్బకు జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. విజయవాడ, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ విమాన సర్వీస్‌లను నిలిపివేసింది. దాంతో బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్‌ ఏసియా విమానం బోర్డింగ్‌ పాస్‌లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖలో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఢిల్లీ - విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవ్వగా చెన్నై - విశాఖ విమానం తిరిగి చెన్నైకి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇకపోతే హైదరాబాద్‌ - విశాఖ స్పైస్‌జెట్‌ విమానాన్ని రద్దు చేయడమే కాక.. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 14 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విమానాల రద్దుతో దాదాపు 700 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు గాస్తోన్నారు. అంతేకాక తుపాను ప్రభావం దృష్ట్యా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. (ఏపీలో పలు రైళ్లు రద్దు)

శ్రీకాకుళం..
పెథాయ్‌ తుపాన్‌ కారణంగా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కానీ ఉపాధ్యాయులు, వంట ఏజేన్సీలు, వంట కార్మికులు పాఠశాలల వద్ద అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు.

విజయనగరం..
పెథాయ్‌ తుపాన్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో అధికారలు హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ కార్యాలయం హెల్ప్‌లైన్‌ నంబర్‌ - 08922 276713, ఆర్డీవో ఆఫీస్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ - 08922 276888

తూర్పు గోదావరి జిల్లా...
జిల్లాలోని ముమ్మిడివరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విద్యాశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గోకవరం డిపో నుంచి బయలుదేరాల్సిన పలు బస్సు సర్వీసులను కూడా రద్దు చేశారు. ఆత్రేయపురంలో అత్యధికంగా 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం, కోరుకొండ మండలంలోని రాఘవపురం, కోటి కేశవరం గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంతో విశాఖ నుంచి రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ వైపు వెళ్లే సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది.

పశ్చిమ గోదావరి...
పెథాయ్‌ తుపాన్‌ కారణంగా జిల్లాలోని తీర ప్రాంతంలోని ఆరు మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 100 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. గడిచిన 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 46(4.6 సెంటిమీటర్ల) మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏలూరులో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

గుంటూరు...
జిల్లావ్యాప్తంగా ఎడతెరపిలేని జల్లులు, తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలోని కొన్ని పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. నిజాం పట్నం పోర్టులో 5వ నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌ కోన శశీధర్‌ తీరప్రాంతంలో పరిస్థిని సమీక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు