చినుకు జాడేది?

29 Jun, 2019 04:36 IST|Sakshi

నాలుగు జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం 

9 జిల్లాల్లో లోటు వర్షపాతం 

504 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు 

ఖరీఫ్‌ సాగుపై ప్రభావం తప్పేలా లేదంటున్న అధికారులు 

ఆందోళన చెందుతున్న రైతులు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చినుకు జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో కరవు ఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడైనా అంతా సవ్యంగా ఉంటుందనుకుంటే సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నెల ఒకటిన ఆరంభమైన ఖరీఫ్‌ సీజన్‌లో 26వ తేదీ వరకు పరిశీలిస్తే నాలుగు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కురవాల్సిన దాని (సాధారణం) కంటే 59 శాతంపైగా లోటు వర్షపాతం నమోదైంది. దీన్ని వాతావరణ పరిభాషలో స్కాంటీ (తీవ్ర దుర్భిక్షం) అని అంటారు. మిగిలిన తొమ్మిది జిల్లాల్లో కూడా సాధారణం కంటే 20 నుంచి 58 శాతం వరకు తక్కువ వర్షం కురిసింది. నెల్లూరు జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జిల్లాలో సాధారణం కంటే 79.1 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 63.1 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 62 శాతం, కృష్ణా జిల్లాలో 60.6 శాతం లోటు వర్షం కురిసింది. ఇదే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కురవాల్సిన సగటు సాధారణ వర్షం కంటే 42.9 శాతం తక్కువ కురిసింది.  

మూడొంతుల ప్రాంతంలో వర్షాభావమే.. 
రాష్ట్రంలో మూడొంతుల ప్రాంతంలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలు ఉండగా 276 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితి (59 శాతం పైగా లోటు వర్షపాతం) ఉంది. మరో 228 మండలాల్లో కురవాల్సిన దాని (సాధారణం) కంటే 20 నుంచి 59 శాతం తక్కువ వర్షం కురిసింది. గత ఐదేళ్లలో వరుసగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడం, ఈ ఏడాది కూడా ఇప్పటివరకు వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. భూగర్భ జలమట్టం పూర్తిగా పడిపోయింది. జలాశయాలు, ప్రాజెక్టులు నీరు లేక అడుగంటాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో బోర్లు కూడా పనిచేయడం లేదు. జూన్‌ చివరి వారం వచ్చినా వర్షం జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరగా వర్షం కురిస్తే వేరుశనగ, ఇతర పంటలు సాగు చేయాలని రాయలసీమ రైతులు ఎదురుచూస్తున్నారు. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల రైతులు వర్షాలు కురిసి జలాశయాల్లో నీరు చేరితే వరి సాగు చేయాలని యోచిస్తున్నారు.  

ఖరీఫ్‌ సాగుపై ప్రభావం
ఈ ఏడాది కూడా వర్షాభావం ప్రభావం ఖరీఫ్‌ సాగుపై తప్పేలా లేదని అధికారులు అంటున్నారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు వేరుశనగ, ఇతర మెట్ట పంటలు సాగు చేస్తుంటారు. రాష్ట్రంలో 9.15 లక్షల హెక్టార్లు (సుమారు 23 లక్షల ఎకరాల్లో) వేరుశనగ సాగు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటివరకు 1.9 శాతం విస్తీర్ణంలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. 16.25 లక్షల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 1.6 శాతం మాత్రమే సాగైంది. ఇంకా సాగుకు సమయం ఉన్నప్పటికీ వర్షాభావం వల్ల సాగు తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు