-

ఇసుక అక్రమ తవ్వకాలను  తీవ్రంగా పరిగణిస్తున్నాం 

10 May, 2019 01:47 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ

ఎన్జీటీ విధించిన రూ.వంద కోట్ల జరిమానా  మూడు నెలల పాటు నిలిపివేత

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక నివాసం చెంతన కృష్ణా నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు మూడు నెలల పాటు నిలుపుదల చేసింది. అయితే ఇంత భారీగా అక్రమ ఇసుక తవ్వకాలు జరపడాన్ని ఎన్జీటీ నిర్దేశించిన కమిటీ ధ్రువీకరించినందున దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని జస్టిస్‌డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  

వేల టన్నుల్లో భారీ యంత్రాలతో తవ్వకాలా? 
‘ఇంత పెద్ద ఎత్తున, ఇన్ని వేల టన్నుల్లో, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఇసుక ఇస్తారా?’అని గురువారం పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిస్తూ ‘ఎన్జీటీ ఆదేశాలు జారీచేసే ముందు మా వాదనలు వినలేదు..’అని నివేదించారు. అయితే ఎన్జీటీ నిర్దేశించిన కమిటీలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితోపాటు రాష్ట్ర విభాగాల అధికారులు కూడా ఉన్నారని, వారు తనిఖీ చేశాకే నివేదిక ఇచ్చారని ప్రతివాదుల తరపు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వివరించారు. ఈ సమయంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ జోక్యం చేసుకుంటూ ‘కమిటీ నివేదికలో వెల్లడైన విషయాలు ఈ అంశం తీవ్రమైనదని తెలియజేస్తున్నాయి’అని పేర్కొన్నారు. తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీచేయడం న్యాయం కాదని గంగూలీ వాదించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ ‘రూ. 100 కోట్లు డిపాజిట్‌ చేయాలన్న ఎన్జీటీ ఉత్తర్వులను 3 నెలల పాటు స్తంభింపజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపించేందుకు రెండు వారాల్లోగా అభ్యర్థన దాఖలు చేసుకోవాలి. సంబంధిత పిటిషన్‌ను ఎన్జీటీ మూడు నెలల్లోగా పరిష్కరించాలి’అని ఉత్తర్వులు వెలువరించారు.  
 

మరిన్ని వార్తలు