ప్రమాదమని తెలిసినా.. తీవ్ర నిర్లక్ష్యం!

17 Aug, 2015 02:51 IST|Sakshi

 పెంటపాడు : ప్రమాదాలను తెలిపే సంకేతాలు, హెచ్చరికలు ఉన్నా వేగంగా మారిన మానవజీవన విధానంలో ప్రజలు వాటిని ఖాతరు చేయడం లేదు. దీనివల్ల నిత్యం రహ దారుల్లో ప్రమాదాలు చోటుకుంటున్నాయి. అనుకోకుండా జరిగే ప్రమాదాలు కొన్ని, తొందరగా వెళ్లాలనే ఉద్దేశంతో విచక్షణరహితంగా వాహనాలు నడిపి ప్రమాదాల బారినపడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రధానంగా అలంపురం వద్ద హైవేపై రోడ్డు ప్రమాద దృశ్యాలు అత్యధికంగా నమోదవున్నాయి. ఈ ప్రాంతంలో రోడ్డుదాటటం వల్లే పలు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాచర్ల నుంచి అలంపురం వెళ్లాలన్నా, అలంపురం, ప్రత్తిపాడు నుంచి రాచర్లమీదుగా పెంటపాడు చేరాలన్నా అలంపురం వద్ద హైవే దాటాలి. నేరుగా రోడ్డు దాటుతుంటే ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రహించిన అధికారులు రోడ్డు దాటకుండా ఫెన్సింగ్ వేశారు.పాదచారులతో పాటు ద్విచక్ర వాహనదారులు వాటిని లెక్కచేయకుండా రోడ్డు దాటుతూనే ఉన్నారు. ఆటోలు, ట్రాక్టర్లు రోడ్డుకు ఎదురుగా వెళ్లడం వల్ల ఇబ్బంది ఎదురవుతోంది.
 
   దీనివల్ల పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. సాధారణంగా రాచర్ల నుంచి తణుకు వెళ్లేందుకు వాహనదారులు ప్రత్తిపాడు వరకు వన్‌వేపై వెళ్లి అక్కడి నుంచి ఎడమవైపు రోడ్డు ఎక్కాలి. అంతదూరం ఎందుకులే అనుకొని ఫెన్సింగ్‌కు ఆనుకొని ఉన్న రోడ్డు డివైడర్ దాటడం  వల్ల ప్రమాదం ముంచుకొస్తోంది. విద్యార్థులు స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం రాచర్ల నుంచి అలంపురం హైస్కూలుకు వెళ్లేందుకు, అక్కడి నుంచి జాతీయరహదారి దాటి రాచర్ల వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూరం వెళ్లి వన్‌వే దాటి రావాటంటే ఆలస్యం అవుతోందని ప్రయాణికులు అంటున్నారు.  దీనిపై ప్రజలు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి. ప్రజలకు ఆటకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.   
 

మరిన్ని వార్తలు