మనుషులు కాదు మృగాళ్లు

13 May, 2018 14:41 IST|Sakshi

గిరిజన బాలికను అడవిలోకి   తీసుకెళ్లి లైంగిక దాడి 

మరో ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నం  

 వృద్ధుడికి స్థానికులు దేహశుద్ధి

నాయుడుపేటటౌన్‌: ఆభం శుభం తెలియని చిన్నారులను మానవ మృగాళ్లు చిదిమేస్తున్నారు. వావివరుసలు, వయసు తారతమ్య భేదాలు మరిచి లైంగిక దాడులతో దారుణాలకు తెగబడుతున్నాడు. మండల పరిధిలో రెండు రోజుల్లో రెండు దారుణాలు వెలుగుచూశాయి. నాయుడుపేట మండలంలో ఓ గిరిజన బాలికను అడవుల్లోకి తీసుకెళ్లి  లైంగిక దాడి చేశాడు. పట్టపగలు పట్టణంలో ఓ ఇంట్లో ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు కామాంతో కళ్లుముసుకుపోయి లైంగిక దాడి జరిపిన ఘటన శనివారం జరిగింది. నాయుడుపేట పట్టణంలో పడమటి వీధిలో గురుస్వామి ఆచారి అనే 58 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 

శనివారం మధ్యాహ్నం సమయంలో గురుస్వామి ఇంటి ముందు ఆటలాడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని బిస్కెట్లు  ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నం చేస్తుండగా ఇంట్లోకి వెళ్లిన చిన్నారి నాయనమ్మ  ఘటన చూచి కోపోద్రిక్తురాలై పాపను తీసుకుని బటయకు వచ్చి చుట్టు పక్కల వారికి చెప్పింది. దీంతో గురుస్వామిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ విషయమై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై రవినాయక్‌ ఫోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.   

గురుస్వామి చేసేది అక్రమ వ్యాపారాలే 
గురుస్వామి ఆచారి మద్యం షాపుల్లో పనిచేస్తూ అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నాడు. పలుమార్లు అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం అధిక రేట్లకు రేషన్‌ బియ్యం, కిరోసిన్‌తో పాటు అర్ధరాత్రి సమయల్లో మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.  గురుస్వామి భార్య మృతి చెందడంతో ఇంట్లోనే ఆసాంఘిక కార్యక్రమాలు సైతం జరుపుతున్నట్లు చెబుతున్నారు. చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఇలాంటి మానవ మృగానికి మరణ శిక్ష విధించాలని స్థానికులు కోరుతున్నారు.  

గిరిజన బాలికపై లైంగిక దాడి   
నమ్మకంగా ఇంటి వద్ద దింపుతానని మాయమాటలు చెప్పి బైక్‌పై తీసుకు వెళ్లి గిరిజన బాలికపై లైంగిక దాడి జరిపిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన 17 ఏళ్ల బాలిక కుటుంబ పోషణ కోసం నాయుడుపేటలోని శ్రీకాళహస్తి బైపాస్‌రోడ్డులో ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో కోద్ది రోజుల క్రితం పనిలోకి చేరింది. ప్రతి రోజు బాలిక విధులు ముగించుకుని సాయంత్రం బస్సులో శ్రీకాళహస్తికి వెళ్తుంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం విధులు ముగించుకుని శ్రీకాళహస్తికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లింది. 

అయితే శ్రీకాళహస్తికి వెళ్లే బస్సు వెళ్లిపోవడంతో ఆమెను నాయుడుపేటలో పనిలో చేర్చిన పెళ్లకూరు మండలం మొదుగులపాళెంకు చెందిన మల్లికార్జునకు స్నేహితుడైన అదే మండలం సీఎన్‌పేటకు చెందిన ఆరూరు పవన్‌కళ్యాణకు ఫోన్‌ చేసింది. దీంతో పవన్‌ కళ్యాణ్‌ బాలికను మోటారు బైక్‌లో శ్రీకాళహస్తికి తీసుకు వెళ్లేందుకు పయనమయ్యాడు. అయితే పవన్‌కాళ్యాణ్‌ ఆ బాలికను పెళ్లకూరు మండలం శిరసనంబేడు వైపు మోటారు బైక్‌లో తీసుకెళ్లడంతో నిలదీసింది. అయితే అతడు షార్ట్‌కట్‌గా వెళ్లొచ్చునని చెప్పి నమ్మించి నేరుగా శిరసనంబేడు అడవుల్లోకి దౌర్జన్యంగా తీసుకువెళ్లాడు. అప్పటికీ ఆ యువతి ప్రతిఘటించినప్పటికీ ఆమెపై దాడికి పాల్పడి భయపెట్టి అరిస్తే చంపేస్తానని బెదిరించి లైంగిక దాడి చేశాడు. 

తిరిగి  బైక్‌ తీసుకుని శిరసనంబేడు సమీపంలోని రహదారిపైకి వచ్చే సరికి స్థానికులు గుర్తించి బాలికను రక్షించి నాయుడుపేటలో ఉన్న పెట్రోల్‌ బంకు వద్దకు తీసుకువచ్చి వదిలారు. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు శుక్రవారం రాత్రి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై సీఐ మల్లికార్జునరావుతో పాటు ఎస్సై రవినాయక్‌ నిందితుడిపై అత్యాచారంతో పాటు ఫోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.     

మరిన్ని వార్తలు