చేతులు కట్టి.. గోచీలు పెట్టి..చెప్పులతో కొట్టి..

31 Jan, 2014 00:35 IST|Sakshi
చేతులు కట్టి.. గోచీలు పెట్టి..చెప్పులతో కొట్టి..
కొప్పవరం (అనపర్తి), న్యూస్‌లైన్ :భర్త, ఇద్దరు పిల్లల ఎదుటే ప్రయాణికురాలిని వికృత చేష్టలతో వేధించి, లైంగికదాడికి యత్నించిన ఆటోడ్రైవర్లను గ్రామస్తులు చెప్పులతో కొట్టి గుణపాఠం చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో పాటు గత 26న క్రైస్తవ సభలకు గుంటూరు వెళ్లారు. బుధవారం సాయంత్రం విజయవాడలో కాకినాడ పాస్ట్ పాసింజర్ ఎక్కి రాత్రి  10.30కి అనపర్తి వచ్చారు. 
 
 అక్కడినుంచి కొప్పవరం వెళ్లేందుకు రైల్వేస్టేషన్ వద్ద దుప్పలపూడికి చెందిన ఆటోడ్రైవర్ కర్రి గంగిరెడ్డితో బేరం కుదుర్చుకున్నారు. రాజమండ్రి క్వారీ ఏరియాకి చెందిన మరో డ్రైవర్ చిట్టూరి శివాజీని వెంటబెట్టుకుని గంగిరెడ్డి తన ఆటోలో వీరిని తీసుకుని బయలుదేరాడు. ఆటోను వారు నేరుగా కాకుండా అనపర్తి శివారు కొత్తూరు శ్మశాన వాటిక మీదుగా తీసుకువెళ్లారు. ఆటోను శివాజీ నడుపుతూ ఉండగా, గంగిరెడ్డి పక్కనే కూర్చుని వెనుకనున్న మహిళతో వికృతచేష్టలు ప్రారంభించాడు. ఆమెపై చేతులు వేస్తూ ఇబ్బంది పెట్టాడు. శ్మశానవాటిక వద్ద ఆటో ఆపిన డ్రైవర్లు ఆమె చేయి పట్టుకుని లాగబోయారు.
 
 దీంతో భార్యాభర్తలు భయంతో బిక్కుమంటూ ఆటోలోనే కూర్చునిపోయారు. పరిస్థితి దిగజారుతున్నా అర్ధరాత్రి కావడం, పక్కనే బిడ్డలు ఉండడంతో భర్త వారిని ఎదిరించలేదు. డ్రైవర్లకు అనుమానం రాకుండా సెల్ ఫోన్‌లో బంధు మిత్రులకు కాల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే అర్ధరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ తీయలేదు. ఈలోగా శ్మశానవాటికకు దాపునే ఉన్న కెనాల్ రోడ్లో వాహన సంచారం కనిపించడంతో అక్కడ అనుకూలంగా లేదనుకున్న డ్రైవర్లు ఆటోను ముం దుకు తీసుకువెళ్లారు. మద్యం మత్తులో ఉన్న గంగిరెడ్డి, శివాజీ బాధితురాలి భర్తను దారి గురించి అడిగారు. లక్ష్మీనర్సాపురంలో తాను పనిచేసే రైసుమిల్లు ఉండడంతో అటువైపు ఆటోను తరలించాలని భావించిన భర్త అటు జనసంచారం ఉండదని వారితో చెప్పాడు. దీంతో డ్రైవర్లు ఆటోను అటే మళ్లించారు. 
 
 రైసుమిల్లు దాటిన తర్వాత ఒక నిర్జన ప్రదేశంలో ఆటోను ఆపిన డ్రైవర్లు కిందికి దిగి తమ ప్లాన్ అమలుపై మాట్లాడుకుంటుండగా, భర్త ఫోన్ ద్వారా తన స్నేహితునికి పరిస్థితి తెలిపాడు. ఈలోగా మరో ఇద్దరు అతడికి ఫోన్ చేశారు. వారికి చోటు చెప్పి వెంటనే రమ్మన్నాడు. దీంతో వారందరూ హుటాహుటిన బయలుదేరి ఆటో ఉన్న ప్రాంతానికి వచ్చారు. డ్రైవర్లు ఇద్దరినీ వారు కొప్పవరం లాక్కెళ్లి బాధితుల ఇంటికి చేరువలో స్తంభాలకు కట్టేశారు. వారి బట్టలు ఊడదీయించి గోచీలు పెట్టించారు. అర్ధరాత్రి ఈ సంగతి గ్రా మంలో దావానంలా వ్యాపించడంతో అంద రూ అక్కడకు చేరుకున్నారు. సాటి మహిళకు జరిగిన అవమానంపై కోపోద్రిక్తులైన మహిళలు గంగిరెడ్డి, శివాజీలను చెప్పులతో చావగొట్టారు. సమాచారం అందుకున్న అనపర్తి పోలీసులు గురువారం ఉదయం వారిద్దరినీ పోలీసు స్టే షన్‌కు
 తరలించారు.
 
>
మరిన్ని వార్తలు