గర్జించిన విద్యార్థులు

21 Sep, 2018 06:23 IST|Sakshi
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట 19 మంది విద్యార్థి నేతల అరెస్ట్‌

పశ్చిమగోదావరి, ఏలూరు (టూటౌన్‌) : పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్స్‌ మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని విద్యార్థుల నినాదాలతో ఏలూరు కలెక్టరేట్‌ దద్ధరిల్లింది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులతో గురువారం చలో కలెక్టరేట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బారికేడ్లను దాటుకుని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన 19 మంది ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతకుముందు విద్యార్థుల ధర్నానుద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి వై.రాము మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల వద్ద ధర్నా నిర్వహించిన విదార్థులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్భందం ప్రయోగిస్తూ అరెస్ట్‌లు చేయడాన్ని ఖండిస్తూ ఈనెల 25న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పరీక్షల ఫీజు చెల్లించాల్సిన తేదీలు యూనివర్సిటీలు ప్రకటిస్తున్నా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మాత్రం ప్రభుత్వం విడుదల చేయడంలేదన్నారు. సంక్షేమ హాస్టల్స్‌ని రెసిడెన్షియల్‌ హాస్టల్స్‌ చేస్తామనే పేరుతో 56 బీసీ హాస్టల్స్‌ని మూసివేయాలనుకునే ప్రభుత్వ ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ హాస్టల్స్‌ మెస్‌ బిల్లులు, కాస్మొటిక్స్‌ నెలల తరబడి విడుదల చేయకపోవడం వల్ల హాస్టల్‌ విద్యార్థులు అరకొర సౌకర్యాల మధ్య, అర్ధాకలితో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కాలేజ్‌ అటాచ్డ్, సంక్షేమ హాస్టల్స్‌ మెస్‌ చార్జీలను పెంచాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థులపై ఫీజుల భారం
విజిలెన్స్‌ దాడుల్లో ఎంత అవినీతి బైటపడినా ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోకపోవడంలో ప్రభుత్వ ఆంతర్యం అర్థమవుతోందని అన్నారు. జీఓనెం 35 కారణంగా నరసాపురం వైఎన్, భీమవరం డీఎన్‌ఆర్, పెనుగొండ ఎస్‌వీకేవీ, ఏలూరు సీఆర్‌ఆర్‌ వంటి కళాశాలల్లో అన్‌ఎయిడెడ్‌ పోస్టులు రెగ్యులరైజ్‌ అవ్వకపోవడం వల్ల విద్యార్థుల ఫీజుల నుండే అధ్యాపకులకు జీతాలు చెల్లించడం వల్ల విద్యార్థులపై ప్రతి సంవత్సరం ఫీజుల భారం పెరుగుతోందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ డెల్టా, అప్‌ల్యాండ్‌ జిల్లా కార్యదర్శులు మాట్లాడుతూ విద్యార్థులు డిమాండ్‌ ఉన్న నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో నూతనంగా కాలేజ్‌ సంక్షేమ హాస్టల్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్స్‌ను రెసిడెన్షియల్‌ స్కూల్స్‌గా మారుస్తున్నామనే పేరుతో మూసివేయడం వల్ల విద్యార్థులు వారికి ఇష్టమైన పాఠశాలలో చేరే అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు. హాస్టల్స్‌ మూసివేత నిర్ణయాన్ని తక్షణం ఉపసంహారించుకోవాలని డిమాండ్‌ చేశారు. మధ్నాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై.రాము, అరశాడ మణికంఠ, కాగిత అనిల్, ఎం.శివరాజు, పి.సాయికృష్ణ, అరకట్ల శరత్, కె.ప్రసాద్, డి.సాగర్, ఎ.
కార్తీక్, డి.పెద్దిరాజు, బి.వినయ్, టి.కార్తీక్, సీహెచ్‌ నాని, ఎన్‌.ప్రసాద్, వై.దిలీప్, ఎం.వెంకటాజు, బి.నాగబాబు, ఎం. మనికాంత్, ఎస్‌.రాజేష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆచంట ప్రసాద్, బాతిరెడ్డి ఆనంద్, పాలకొల్లు యుగంధర్, ప్రతీప్, వాసు తదితరులు నాయకత్వం వహించారు.

మరిన్ని వార్తలు