శాకంబరి దేవిగా దుర్గమ్మ దర్శనం

14 Jul, 2019 12:28 IST|Sakshi

నేటి నుంచి మూడు రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి పండుగ శోభను తరించుకుంది. జగతిని కాచే తల్లి  మహోత్సవానికి వేళయింది. ఆదివారం నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కావడంతో దుర్గగుడి కళకళలాడుతోంది. కూరగాయలు..  ఆకుకూరలు.. ఫలాలతో దుర్గమ్మ సర్వాంగసుందరంగా అలలారుతోంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏడాదిలాగానే తెలంగాణ నుంచి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు సుమారు 200మందితో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ దుర్గమ్మకు బోనం సమర్పించేందుకు వచ్చినవారికి  దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ స్వాగతం పలికారు. అంతకు ముందు బ్రాహ్మణవీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. మేళతాళాలు, మంగలవాద్యాల నడుమ ఊరేగింపు అమ్మవారి ఆలయానికి చేరింది.

మూడు రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారి అలంకరణకు ఆకుకూరలు వినియోగించారు. రెండోరోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడోరోజు అయిన మంగళవారం బాదం. జీడిపప్పు, కిస్‌మిస్‌, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌తో అలకరించనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభం అయిన ఈ ఉత్సవాలు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తాయి. కాగా మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి దర్శానాన్ని నిలిపివేస్తారు. కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడురోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకుకూరలను దండగలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 


 

మరిన్ని వార్తలు