కాంగ్రెస్, టీడీపీపై శంకరనారాయణ ధ్వజం

11 Oct, 2013 03:47 IST|Sakshi

 పెనుకొండ, న్యూస్‌లైన్ :
 అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఫిక్సింగ్‌తోనే రాష్ర్ట విభజనకు బీజం పడిందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ధ్వజమెత్తారు.
   వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం పెనుకొండలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతు దీక్ష నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలో ముఖ్య అతిథి జిల్లా కన్వీనర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనూకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ప్రజాగ్రహం వ్యక్తమయ్యే సరికి తోక ముడిచి ఢిల్లీలో దీక్షకు దిగారని మండిపడ్డారు. ఆయన దీక్ష ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పుకోలేకపోతున్నారన్నారు. రెండున్నర నెలలుగా రాష్ర్టం రావణకాష్టగా మారడానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమన్నారు. విభజన జరిగితే సీమాంధ్రకు సాగు-తాగునీరు దొరకడం కష్టమవుతుందన్నారు. 60 సంవత్సరాల పాటు హైదరాబాద్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడ్డారన్నారు. ఇప్పుడు రాష్ర్ట విభజన పేరుతో హైదరాబాద్‌ను వదులుకోవడానికి సీమాంధ్రులు సిద్ధంగా లేరన్నారు.
 
  రాష్ర్ట విభజనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేపట్టారన్నారు. రాష్ర్టం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ విషయాన్ని మిగతా పార్టీలు కూడా గ్రహించి సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సానిపల్లి మంగమ్మ, నియోజక వర్గ ఎన్నికల పరిశీలకుడు లోచర్ల విజయ భాస్కరరెడ్డి, కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ జీవీపీ నాయుడు తదితరులు మాట్లాడుతూ రాష్ర్ట విభజన జరిగితే రైతుల పరిస్థితి దుర్భరంగా మారుతుందన్నారు. తినడానికి తిండి దొరక్క ఇతర  రాష్ట్రాలకు  వలస వెళ్లాల్సిన దౌర్భాగ్యం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు