వృద్ధాశ్రమానికి చేరిన శివశంకరయ్య

23 Jan, 2020 10:36 IST|Sakshi
వృద్ధాశ్రమంలో అప్పగిస్తున్న దృశ్యం

అనంతపురం, హిందూపురం: కుటుంబ సభ్యుల నిరాదరణకు గురైన వైఎస్సార్‌ జిల్లాకు చెనిక్కాయపల్లి రామాపురం చిట్టూరుకు చెందిన వృద్ధుడు శివశంకరయ్య హిందూపురం ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించుకుని సేవామందిరంలోని వృద్ధాశ్రమానికి చేరాడు. శివశంకరయ్య వయసులో ఉన్నపుడు జల్సాలకు అలవాటుపడి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. వృద్ధాప్యం మీద పడ్డాక అనారోగ్యం బారినపడి ఇటీవల హిందూపురం ఆస్పత్రిలో చేరాడు. ఇతని దీనస్థితిని గమనించిన ‘సాక్షి’ ఈ నెల రెండో తేదీ నుంచి వరుస కథనాలు ప్రచురించింది. అవసాన దశలో ఉన్న అతడిని కుటుంబంతో కలపడానికి ప్రయత్నించింది. అయితే శివశంకరయ్య తమకు చేసిన అన్యాయాన్ని తలుచుకుని కుటుంబ సభ్యులు ఆయన్ను తీసుకుపోవడానికి ముందుకు రాలేదు.

చక్కెరవ్యాధిగ్రస్తుడైన ఈయన కాలుకు అయిన గాంగ్రీన్‌ వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నాడు. కుటుంబ సభ్యులు చీదరించుకున్నా ముస్లిం నగారా టిప్పు సుల్తాన్‌ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉమర్‌ ఫరూక్, షేక్‌ షబ్బీర్, ఉమర్‌లు ఆ వృద్ధుడికి అండగా నిలిచి సపర్యలు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కేశవులు, వైద్యులు శివప్రసాద్‌ నాయక్, డాక్టర్‌ ప్రభాకర్‌ నాయుడులు కూడా మానవత్వంతో స్పందించి వృద్ధుడి కాలికి ఆపరేషన్‌ చేశారు. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో సీఐలు బాలమద్దిలేటి, ధరణీకిషోర్‌ చొరవతో ఎస్‌ఐ కరీం దగ్గరుండి శివశంకరయ్యను సేవామందిరంలోని వృద్ధాశ్రమంలో చేర్చారు.  రెండురోజుకోకసారి  వైద్యపరీక్షలు చేయించి, కట్టు కట్టిస్తామని స్వచ్ఛందసంస్థ సభ్యులు తెలిపారు.
అంపశయ్యపై నాన్న!

నాకు నాన్నఅవసరంలేదు...

మరిన్ని వార్తలు