అర్ధసెంచరీకి అడుగు దూరంలో..

11 Dec, 2019 10:37 IST|Sakshi
రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ (రిశాట్‌ – ఈబీఆర్‌1) ఉపగ్రహం

75వ ప్రయోగానికి సిద్ధం

దేశ భద్రతలో కీలకం.. సీ – 48

సాక్షి, సూళ్లూరుపేట: షార్‌ కేంద్రం నుంచి ఇప్పటి వరకూ చేసిన ప్రయోగాల్లో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌దే అగ్రతాంబూలం. 74 ప్రయోగాల్లో 49 పీఎస్‌ఎల్‌వీ రాకెట్లే ఉన్నాయి. 1993 సెప్టెంబర్‌ 20న తొలిసారిగా పీఎస్‌ఎల్‌వీ డీ–1, 2017 ఆగస్ట్‌ 31న ప్రయోగించింది. 27ఏళ్ల ముందు మొదలైన విజయపరంపర కొనసాగుతోంది. 49 ప్రయోగాల్లో రెండు మాత్రమే విఫలమయ్యాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) రాకెట్‌ బహుళ ప్రయోజనకారిగా మారి ఇస్రో చరిత్ర, గతినే మార్చేసింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ఇస్రోకు నమ్మకమైన బ్రహ్మాస్త్రంలా తయారైంది.

బుధవారం ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ–48 రాకెట్‌తో పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌ అర్ధసెంచరీని పూర్తి చేసుకోనుంది. ఇస్రోకు దేశీయంగానే కాకుండా వాణిజ్యపరమైన ప్రయోగాల్లోనూ అగ్రస్థానంలో వెలుగొందుతూ బహుళ ప్రయోజనకారిగా దోహదపడుతోంది. దేశీయంగా రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలతో పాటు అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్తూ ఆదాయ గనిగా మారింది. చంద్రయాన్, మంగళ్‌యాన్‌ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకే సారి పది ఉపగ్రహాలు, మళ్లీ 20 ఉపగ్రహాలు, ఆ తర్వాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్‌ఎల్వీకే సొంతం. ఇప్పటివరకు 49 పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 310 విదేశీ ఉపగ్రహాలు, 46 స్వదేశీ ఉపగ్రహాలు, దేశంలోని పలు యూనివర్సిటీలకు 10 స్టూడెంట్‌ ఉపగ్రహాలను పంపించి ఇస్రో ప్రగతికి బాటలు వేస్తోంది.

కంటికి రెప్పలా..
దేశీయ అవసరాల నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భూమిని అన్ని రకాలుగా పరిశోధన చేసే రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ ఉపగ్రహాలను (రిశాట్‌) ప్రయోగిస్తోంది. దేశ భద్రతకు సంబంధించి కంటికిరెప్పలా కాపాడుతోంది. సరిహద్దులో జరిగే చొరబాట్లను పసిగడుతోంది. ఇప్పటివరకు రెండు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు మూడోసారి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ – 48 రాకెట్‌ ద్వారా రిశాట్‌ – 2బీఆర్‌1 అనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపగ్రహ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్‌ను అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. 2012 ఏప్రిల్‌ 20 పీఎస్‌ఎల్‌వీ సీ – 19 రాకెట్‌ ద్వారా రిశాట్‌ – 2 అనే ఉపగ్రహాన్ని పంపించారు.

దీని కాలపరిమితి పూర్తవడంతో ఈ ఏడాది మే 22న పీఎస్‌ఎల్‌వీ సీ 4–6 రాకెట్‌ ద్వారా రిశాట్‌ – 3బీ అనే ఉపగ్రహాన్ని పంపించారు. ఈ ఉపగ్రహాల్లో అమర్చిన పేలోడ్స్‌ భూమ్మీద 20  గీ 30 సెంటీమీటర్ల వ్యాసార్థంలో మాత్రమే ఛాయా చిత్రాలు తీసేవి. సీ – 48లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఎక్స్‌బాండ్‌ సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌ భూమ్మీద జరిగే మార్పులను 10 సెంటీమీటర్ల వ్యాసార్థంలో ఉండే చిన్నవాటినైనా సరే అత్యంత నాణ్యమైన చిత్రాలను పంపించే సామర్థ్యం కలిగి ఉంది.

దేశ సరిహద్దుల్లో జరిగే అక్రమ చొరబాట్లు, పంటల విస్తీర్ణం, సాగువిస్తీర్ణం, అడవులను పరిశోధించడమే కాకుండా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలోనైనా అత్యంత నాణ్యమైన  ఛాయా చిత్రాలు తీసి పంపిస్తుంది. ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్‌ భూమికి 576 కిలోమీటర్ల ఎత్తు నుంచి దేశానికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. రాత్రీ పగలు అనే తేడా లేకుండా అత్యంత నాణ్యమైన  ఛాయా చిత్రాలు తీసే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంది. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు రోదసీలో ఉండి పనిచేస్తుంది. భవిష్యత్తులో రి«శాట్‌ ఉపగ్రహాలను పెంచుకునే దిశగా ఇస్రో అడుగులేస్తోంది.

మరిన్ని వార్తలు