‘మరో ప్రజాప్రస్థానం’తో షర్మిల రికార్డు : 200 రోజులు..

5 Jul, 2013 04:54 IST|Sakshi
‘మరో ప్రజాప్రస్థానం’తో షర్మిల రికార్డు : 200 రోజులు..

* నేడు విశాఖ ఆర్‌కే బీచ్ వద్ద భారీ బహిరంగ సభ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సడలని సంకల్ప బలానికి నిదర్శనంగా సాగుతున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర రికార్డు మైలురాయిని చేరుకోనుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన ఈ యాత్ర శుక్రవారానికి 200 రోజులను పూర్తి చేసుకోనుంది. అంతే కాదు.. శుక్రవారం విశాఖపట్టణం తూర్పు నియోజకవర్గంలో షర్మిల అడుగు పెట్టడంతో వంద నియోజకవర్గాల్లో యాత్ర పూర్తికాబోతోంది. ఈ రెండు ప్రధాన ఘట్టాలకూ విశాఖ నగరం వేదిక కాబోతోంది.

ఇడుపులపాయలో మొదలు:

ప్రజా సమస్యలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో కుమ్మక్కైన ప్రతిపక్ష టీడీపీ వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున 2012 అక్టోబర్ 18న షర్మిల ఇడుపులపాయలో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ప్రారంభించారు. తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదేళ్ల కిందట చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర స్ఫూర్తితో, అన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతో ఆమె చేపట్టిన ఈ యాత్రకు అడుగడుగునా అసాధారణ స్పందన లభిస్తోంది.

పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పడుతోంది. మధ్యమధ్యలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు ప్రజాప్రవాహం పోటెత్తుతోంది. వైఎస్సార్ జిల్లా, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి.. మొత్తం 11 జిల్లాల్లో యాత్ర పూర్తిచేసుకొని గత నెల 24న నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద షర్మిల విశాఖ జిల్లాలోకి అడుగు పెట్టారు.

జిల్లాలో 11 రోజులుగా సాగుతున్న షర్మిల యాత్రకు ప్రతి గ్రామంలో అమిత ప్రజాదరణ లభిస్తోంది. జిల్లాలో నర్సీపట్నం మొదలు సబ్బవరం వరకు నిర్వహించిన ప్రతి బహిరంగ సభకూ అశేష ప్రజానీకం హాజరవుతూ, ‘మీ వెంటే మేమున్నాం’ అని మద్దతు ప్రకటిస్తోంది. రాష్ట్ర సమస్యలపై, కుమ్మక్కు రాజకీయాలపై, స్థానిక సమస్యలపై షర్మిల చేస్తున్న సునిశిత విమర్శలకు అద్వితీయ స్పందన లభిస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా వేలాది మంది ప్రజలు ఆమె అడుగులో అడుగు వేసి వెంట సాగుతుండడంతో యాత్ర ప్రజల పండుగలా కనిపిస్తోంది.

అన్ని వర్గాల అండ:
నిర్విరామంగా పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిలపై అన్ని వర్గాల అభిమానం వెన్నెల జల్లులా కురుస్తోంది. ఆమెను చూడడానికి, ఆమెతో మాట్లాడడానికి, చేతులు కలపడానికి వృద్ధులు, మహిళలు, యువజనులు తరలివస్తూ ఉండడంతో యాత్రలో ఉత్తేజ, ఉద్వేగభరిత వాతావరణం నెలకొంటోంది.

ఎందరో తమ బాధలను షర్మిల దృష్టికి తెచ్చి ‘మన ప్రభుత్వం వచ్చాకైనా వీటిని పరిష్కరించండమ్మా’ అంటున్నారంటే పార్టీపై ప్రజలు ఎంత ఆశలు పెట్టుకున్నారో అవగతమవుతోంది. షర్మిల జనం సమస్యలను సావధానంగా వింటూ.. రాబోయేది మంచి రోజులని వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. శుక్రవారం నాటికి పాదయాత్ర 200 రోజులకు చేరుకుంటూ ఉండడంతో విశాఖలో ఘన స్వాగతం పలకడానికి పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్‌కే బీచ్ వద్ద శుక్రవారం సాయంత్రం 5 గంటలకు భారీ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు