ప్రజాభిమానమే నడిపించింది: షర్మిల

5 Jul, 2013 19:31 IST|Sakshi
విశాఖలో ప్రసంగిస్తున్న షర్మిల

ప్రజల నుంచి వెల్లువెత్తిన అభిమానమే తనను నడిపిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. తాను సాగిస్తున్న‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో శుక్రవారం
సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో అశేష జనాన్ని ఉద్దేశించి ఆమె ప్రసగించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలపై షర్మిల నిప్పులు చెరిగారు.

ప్రజా సమస్యలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కిరణ్ సర్కారు ఎప్పుడు సరిగ్గా కరెంట్ ఇవ్వలేదన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. పక్కా ఇళ్లకు పాడి కట్టిందన్నారు. వైఎస్ఆర్ మంజూరు చేసిన పక్కా ఇళ్లకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని తెలిపారు. రైతులకు మద్దతు ధర లేదు, పేదలకు సబ్సిడీలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా చార్జీలు పెంచుతూ ఆమ్ ఆద్మీకి వెన్నుపోటు పొడుస్తూనే ఉందన్నారు. పెట్రోల్, డీజిల్, ఎరువులు, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ఎక్కడుంది సంక్షేమని ప్రశ్నించారు.  

ప్రజారాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల మందిని పిచ్చోళ్లను చేసి ఒక్క మంత్రి కోసం చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారని ఎద్దేవా చేశారు. విపక్ష నేతగా అధికార కాంగ్రెస్ కాలర్ పట్టుకుని ప్రజా సమస్యలపై నిలదీయాల్సిన చంద్రబాబు చాటుగా కిరణ్ సర్కారుకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు తన హయాంలో ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకుని 8 ఏళ్లలో 8 సార్లు కరెంట్ చార్జీలు పెంచారని గుర్తుచేశారు. రూ.50 ఉన్న హార్స్ పవర్ చార్జీని రూ.650 చేసిన ఘనత బాబుదే అన్నారు. చంద్రబాబుకు మళ్లీ అధికారమిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టని హెచ్చరించారు.

రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేసి జగనన్నను జైలుకు పంపాయని షర్మిల ఆరోపించారు. వంద మంది కలిసి వెయ్యి కుట్రలు పన్ని వ్యవస్థలను వాడుకుని జగన్ ను తొక్కేయాలనుకుంటున్నారని చెప్పారు. జైల్లో ఉన్న కూడా జగనన్న గుండె నిబ్బరం తగ్గలేదని, ప్రజల గురించే ఆయన ఆలోచిస్తున్నారని తెలిపారు. కారుచీకట్లో ఉన్నా జగన్ కాంతి కిరణమే అన్నారు. జైల్లో ఉన్నా జగనన్న తిరుగులేని జననేత అని నినదించారు.
 

రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న సీఎం అయిన తర్వాత రాజన్న ప్రతి మాటను నెరవేరుస్తాడని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహానేత ప్రతి పథకానికి జీవం పోస్తుందని హామీయిచ్చారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.

>
మరిన్ని వార్తలు