ఏడేళ్ల నరకానికి విముక్తి...

3 Feb, 2018 12:03 IST|Sakshi

 స్వదేశం చేరుకున్న ‘పద్మ’

 నేషనల్‌ వర్కర్స్‌  వెల్ఫేర్‌ ట్రస్ట్‌ చొరవ

రాజోలు: ఉపాధి  కోసం కువైట్‌ వెళ్లిన మహిళ ఏడేళ్లపాటు నరకం చూసింది సఖినేటిపల్లి బళ్లపేటకు చెందిన నల్లి పద్మపాండే. ఎట్టకేలకు నేషనల్‌  వర్కర్స్‌  వెల్ఫేర్‌ ట్రస్ట్‌ చొరవతో శనివారం భారత దేశానికి తిరిగి వచ్చింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పద్మను నేషనల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ కో–ఆర్డినేటర్‌ లిస్సీ జోసఫ్‌ చొరవతీసుకొని ప్రత్యేక వాహనంలో స్వగ్రామం పంపించే ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి...సఖినేటిపల్లి బళ్లపేటకు చెందిన బళ్ల  పద్మపాండేకు మలికిపురం మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన నల్లి  శ్రీనుతో వివాహమైంది. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఉపాధి కోసం పద్మ కువైట్‌  వెళ్లింది. అంతే ఆమె జీవితంలో నరకం ప్రారంభమైంది. కువైట్‌ వెళ్లిన రెండేళ్లపాటు కుటుంబ సభ్యులతో ఫోన్, ఉత్తరాల ద్వారా ‘తాను చాలా ఇబ్బందులు పడుతున్నాని, ఇండియాకు వచ్చేస్తా’నని చెప్పేది. తరువాత ఫోన్‌ కాని,  ఉత్తరం కాని ఆమె నుంచి రాకపోవడంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. సుమారు ఆరు నెలల క్రితం కువైట్‌లో తీవ్ర కాలిన గాయాలు, దెబ్బలతో ఓ మహిళ రోడ్డు పక్కన పడి ఉండడాన్ని ఉపాధి కోసం వెళ్లిన తెలుగువారు గుర్తించారు. తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉంటారని ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.

సోషల్‌ మీడియా వాట్సాప్,  ఫేస్‌బుక్, ట్విట్టర్‌ మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ చిత్రాన్ని సఖినేటిపల్లి మండలం బళ్లపేటలోని పద్మ మేనమామ నక్కా రామారావు గుర్తించారు. మేనకోడలను ఎలాగైనా స్వదేశానికి తీసుకుని రావాలని రాజోలులో ఉన్న నేషనల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌  సభ్యుడు, న్యాయవాది నల్లి శంకర్‌ను సంప్రదించారు. కువైట్‌ ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్న పద్మను భార త రాయబార కార్యాలయం ద్వారా స్వగ్రామానికి తీసుకుని వచ్చేందుకు కృషి చేశారు. అమలాపురం ఎంపీ  పండుల రవీంద్రబాబు, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావులు ఇచ్చిన సిఫార్సు లేఖలు ద్వారా ఎట్టకేలకు కువైట్‌ నుంచి హైదరాబాదు ... అక్కడ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు స్వగ్రామానికి చేరుకోగలిగిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అన్ని విధాలా నష్టపోయిన పద్మను  ప్రభుత్వం ఆదుకోవాలని,  ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. 

మరిన్ని వార్తలు