ఆమెకు ముగ్గురు భార్యలు

27 Dec, 2017 02:29 IST|Sakshi

వైఎస్సార్‌ జిల్లాలో వెలుగు చూసిన మాయలేడి

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లిదండ్రులు

జమ్మలమడుగు: ఒక అమ్మాయి పురుషుడి అవతారమెత్తి ఏకంగా ముగ్గురు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంది. ఈ వింత ఘటన ఏపీలోని వైఎస్సార్‌ జిల్లా కాశినాయన మండలంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటుకల పాడు గ్రామానికి చెందిన రమాదేవి తమిళ నాడులోని రోహిణి కాటన్‌ మిల్లులో పనిచేస్తుండేది. అక్కడినుంచి తిరిగి వచ్చి పులివెందులలోని మరో కాటన్‌మిల్లులో చేరింది. ఇక్కడ పరిచయాలు పెంచుకుని అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన 17 ఏళ్ల యువతిని వివాహం చేసుకుంది. అలాగే ప్రొద్దుటూరుకు చెందిన మరో యువతిని వివాహం చేసుకుంది.

ఈ విషయం అమ్మాయిల తల్లిదండ్రులకు తెలియ డంతో వారు మందలించి అమ్మాయిలను తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా అదే మిల్లులో పనిచేస్తున్న పెద్దముడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన మౌనిక అనే 18 ఏళ్ల యువతితో ఇటీవల రమాదేవికి పరిచయం ఏర్పడింది. వీరిరువురూ కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రమాదేవి కాటన్‌మిల్లులో పనిచేయడం మానేయడంతో వీరిరువురి మధ్యా ఫోన్‌ సంభాషణలు జరుగుతుండేవి.

రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ఓ వివాహానికి వెళ్లిన రమాదేవి అక్కడి నుంచి మౌనికకు ఫోన్‌ చేసి మాట్లాడింది. నీవులేకుంటే నేను చనిపోతానని మౌనిక చెప్పడంతో రమాదేవి భీమగుండం వెళ్లింది. రమాదేవి ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో మౌనిక తల్లిదండ్రులు గ్రామస్తుల సహకారంతో డీఎస్పీ కృష్ణన్‌ వద్దకు తీసుకెళ్లారు. పోలీసుల విచారణలో గతంలో తాను ఇద్దరిని వివాహం చేసుకున్నానని.. ఇప్పుడు మౌనికను కూడా వివాహం చేసుకున్నట్లు రమాదేవి వివరించింది. దీంతో పూర్తి సమాచారం రాబట్టేందుకు పోలీసులు గతంలో వివాహం చేసుకున్న అమ్మాయిలను పిలిపించి విచారించారు. అమ్మాయిలను ట్రాప్‌ చేసి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు రమాదేవి చేస్తోందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు