షీ టీమ్స్ రెడీ

11 Mar, 2015 07:18 IST|Sakshi

 మహిళల భద్రతకు
 ప్రత్యేక బృందాలు
 కళాశాలలు.. గ్రామాలు..
 పట్టణాల్లో నిఘా
 జిల్లాలో 59 మంది పోలీసులతో ఏర్పాటు
 ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ వెల్లడి
 

'రాగిణి.. మదనపల్లెలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ప్రతీ రోజూ ఓ ఆకతాయి బస్టాపు వద్దకు వచ్చి వెంటపడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏమవుతుందోనని భయంతో మౌనం వహిస్తోంది. ఈ తతంగాన్ని బస్టాపు వద్ద చుడిదార్ ధరించిన ఇద్దరు మహిళా పోలీసులు చూసి పట్టుకుని తాటతీసి స్టేషన్‌కు తరలించి, ఈవ్‌టీజింగ్ కేసు పెట్టి జైలుకు పంపిస్తారని అతనికి తెలియదు పాపం..'
 
"కీర్తన ఓ సాధారణ గృహిణి. చిత్తూరు నగరంలో ఉంటోంది. భర్త ఇంట్లో లేని సమయంలో  ముక్కూ మొహం తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్. అసభ్య మెసేజ్‌లు వస్తున్నాయి. ఫోన్ రింగయితే భయపడిపోతోంది. ‘షీ’ టీమ్స్ గురించి విన్న ఈమె తన వివరాలు చెప్పొద్దని నిందితుడి భరతం పట్టాలని పోలీసులను కోరింది. గంటలో పోలీసులు ఆ పోకిరిని పట్టుకుని కటకటాల్లోకి నెడుతారు."
 షీ టీమ్‌ల ఏర్పాటుతో మహిళలకు ఈ తరహా భద్రత కల్పించేందుకు పోలీసులు కంకణం కట్టుకున్నారు.
 

షీ... అంటే ఆమె. స్త్రీలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అకృత్యాలను అరికట్టడానికి జిల్లా పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. జంటనగరాల్లో అమలవుతున్న ‘షీ’ టీమ్స్‌ను జిల్లాలో తొలిసారిగా ప్రవేశపెడుతున్నట్లు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం వద్ద దీన్ని ప్రాంరభించారు. మొత్తం 59 మందితో తొలి దశగా ఈ బృందాలను ప్రజల మధ్యలో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు సైతం మహిళల భద్రత కోసం పోలీసులకు సహకరించాలని కోరారు. త్వరలో కమ్యూనిటీ పోలీస్ పేరిట ట్రాఫిక్, బందోబస్తు, ఇతర సేవల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, డీఎస్పీలు గిరిధరరావు, రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, రమణయ్య, దేవదాసులు, సీఐలు సూర్యమోహనరావు తదితరులు పాల్గొన్నారు.

 

ఐదు ప్రాంతాల్లో షీ టీమ్స్ ఏర్పాటు
తొలి ప్రయత్నంగా జిల్లాలోని ఐదు చోట్ల ‘షీ’ టీమ్స్ ఏర్పాటు చేశారు. చిత్తూరులో 16 మంది, పలమనేరులో 11 మంది, మదనపల్లెలో 15 మంది, కుప్పంలో ఆరుగురు, పుత్తూరులో 11 మందితో మహిళా భద్రత కమిటీలు ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, కళాశాలల కూడళ్లు, బస్టాపుల్లో బృంద సభ్యులు మఫ్టీలో తిరుగుతుంటారు. ఎక్కడైనా మహిళలకు ఇబ్బంది కలిగిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. అంతేగాక భార్య, భర్తల మధ్య గొడవలను తీర్చడం, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లలో ఇరువురికీ అవగాహన కల్పించడం చేస్తారు. గ్రామాలు, పట్టణాల్లో మహిళా భద్రత కమిటీలు పనిచేస్తాయి. రానున్న ఆరు నెలల కాలంలో జిల్లాలోని అన్ని పట్టణాలు, నగరాలు, మేజర్ పంచాయతీల్లో ‘షీ’ టీమ్స్ ఏర్పాటు చేయడానికి ఇదొక ప్రయత్నంగా పోలీసుశాఖ భావిస్తోంది. ఇందులో వచ్చే లోటుపాట్లు సరిదిద్దుకుని భవిష్యత్తులో ఏర్పాటు చేసే కమిటీల్లో వాటిని సరిచేసుకుంటారు.

మరిన్ని వార్తలు