రైతు కష్టం నేలపాలు

2 Feb, 2014 03:43 IST|Sakshi
రైతు కష్టం నేలపాలు

గిట్టుబాటు ధరలేని పంటను చూస్తూ రోజూ బాధపడేకంటే తొలగించడమే మంచిదని భావించాడు ఓ రైతు. ఇంకో రైతు కూలీలకూ గిట్టుబాటు కావడంలేదని పంటను పొలంలోనే వదిలేసి గుండెబరువు దించేసుకున్నాడు. ఈ ఘటనలు తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో శనివారం చోటు చేసుకున్నాయి.
 
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామం కంబాలపల్లెకు చెందిన ఈ.బయ్యారెడికి 75 ఏళ్లు. ఊహ తెలిసినప్పటి నుంచి వ్యవసాయమే జీవనాధారం. శంకరాపురం సమీపంలోని తన నాలుగెకరాల్లో తీగ టమాట సాగుచేశాడు. టమాట సాగుకు ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టాడు. టమాటాలు విరగ్గాశాయి. రైతు మురిసిపోయాడు. తామొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు టమాట ధరలు అథఃపాతాళానికి చేరాయి. కొనుగోలుచేసే దిక్కులేదు.

కిలో రుపాయి పలకడంలేదు. ఎకరాకు 50 టన్నుల దాకా దిగుబడి వచ్చినా ఫలితం లేకపోయింది. బయ్యారెడ్డి రోజూ పొలం వద్దకు రావడం,నిండుగా కనిపిస్తున్న పంటను చూసి మార్కెట్‌కు తరలించే ధైర్యం లేక వెనుదిరగడం జరిగేది. రోజులు గడుస్తున్నా టమాట ధర పెరగకపోవడంతో పొలంలోనే కాయలు వదిలేశాడు. పంటను చూసి రోజూ బాధపడడం కంటే టమాట మొక్కలుతొలగించడమే మంచిదని భావించాడు. శనివారం కూలీలను పెట్టించి టమాట మొక్కలను తొలగించాడు. వాటిని ట్రాక్టర్లో వేసుకుని శంకరాపురం రోడ్డుపక్కన దిబ్బలా పోయించాడు. వాటిపై కూర్చొని రైతు కొంత సేపు దిగాలుగా కూర్చుండి పోయాడు. బిడ్డలా పెంచుకున్న పంట.. నాచేతుల్తోనే నాశనం చేశానన్న ఆవేదనతో కుమిలిపోయాడు.
 
కలకడలోనూ అదే పరిస్థితి
 
కలకడ మండలం కే.దొడ్డిపల్లె పంచాయతీ గోపాలపురానికి చెందిన రమణ రెండు ఎకరాల్లో టమాట పంట సాగు చేశాడు. మూడు రోజుల క్రితం 30 కిలోల చొప్పున వంద బాక్సుల టమాట పంట చేతికొచ్చింది. కూలీల కోసం పది మందిని పెట్టా డు. ఒక్కో కూలీకి రూ.200 వందల చొప్పున రూ.2వేలు చెల్లించాడు. ఆపై గోపాలపురం నుంచి వేలూరు మార్కెట్‌కు తీసుకెళ్లాడు. రవాణా ఖర్చుల కోసం బాక్సుకు రూ.35 చొప్పున రూ.3,500 ఖర్చుచేశాడు.

అక్కడ బాక్సు(30కిలోలు) ధర రూ.40 చొప్పున విక్రయించాడు. రూ.4000 వేలు చేతికొచ్చింది. అందులో మార్కెట్ కమీషన్ పది శాతం చొప్పున రూ.400 చెల్లించాడు. బాక్సులు దించినందుకు కూలీకి రూ.300 చెల్లించాడు. అన్ని ఖర్చులు పోను రూ.2,200 అప్పు తేలాడు. అప్పుల ఊబిలో కూరుకుపోకముందే తేరుకోవడం మంచిదని భావించాడు. పంటను చేలల్లోనే వదిలేశాడు. కాయలు పండి పొలంలోనే రాలిపోతున్నాయి.
 

మరిన్ని వార్తలు