మా విచారణల్లో ‘శేషాచలమే’ ప్రధానం

25 Apr, 2015 01:05 IST|Sakshi
మా విచారణల్లో ‘శేషాచలమే’ ప్రధానం

విలేకరుల సమావేశంలో ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్

హైదరాబాద్: తమ క్యాంప్ సిట్టింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో విచారించిన కేసుల్లో శేషాచలం ఎన్‌కౌంటరే ప్రధానమైన కేసు అని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అన్నారు. ఆ తరువాత స్థానంలో తెలంగాణలో వికారుద్దీన్ సహా ఐదుగురి ఎన్‌కౌంటర్ సంఘటన ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో క్యాంప్ సిట్టింగ్ ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌తో పాటు సభ్యులు జస్టిస్ డి.మురుగేశన్, జస్టిస్ సి.జోసెఫ్, ఎస్సీ సిన్హా విలేకరులతో మాట్లాడారు. శేషాచలం ఎన్‌కౌంటర్ పై ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌తో మేజిస్టీరియల్ విచారణ జరపాలని ఆదేశించామని కమిషన్ పేర్కొంది.

వారం రోజుల్లో ఎన్‌హెచ్‌ఆర్సీ తరఫున ప్రత్యేక దర్యాప్తు బృందం ఘటనా స్థలాల్లో పర్యటిస్తుందని తెలిపారు. దీంతో పాటు వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ పైనా పూర్తి నివేదికలు అందిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుకిచ్చే పరిహారం రూ.లక్షగా ఉందని, దీన్ని పెంచాలని  సూచించామన్నారు. ఈ మొత్తాన్ని రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తమ దృష్టికి తీసుకొచ్చిందని జస్టిస్ బాలకృష్ణన్ వివరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని సూచించామన్నారు.  ఢిల్లీలో ‘ఆప్’ ర్యాలీ సందర్భంగా రైతు ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలో మానవ హక్కుల ఉల్లంఘన ఉన్నట్లు కనిపించట్లేదని అన్నారు.
 
 

మరిన్ని వార్తలు