‘ఇంగ్లిష్‌’ను వద్దంటున్నది కుహనా రాజకీయ నేతలే

21 Nov, 2019 09:28 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌ సూర్యనారాయణరావు 

సాక్షి, అమలాపురం : ఆంగ్ల బోధనను అడ్డుకుంటోంది కుహనా రాజకీయ నేతలేనని, ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్‌ బోధన అమలును మేధావులందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకుడు, ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్‌ అధ్యక్షతన బుధవారం ఉదయం మేధావుల సమావేశానికి సూర్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నీట్, ఐఐటీ, ఐఐఎం వంటి జాతీయ పోటీ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా చేసేందుకు కొంత కాలంగా ఓ కుట్ర జరుగుతోందన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ ప్రతి విద్యార్థి జాతీయ పోటీ పరీక్షలను ఇంగ్లిష్‌ పరంగా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ఆ బోధనను అందుబాటులో తీసుకువస్తున్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రెగ్యులేటరీ యాక్ట్‌ పేరుకే అమలు చేసి డీమ్డ్‌ యూనివర్సిటీలు, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు అధిక ఫీజుల వసూళ్లకు మరింత కళ్లాలు ఇచ్చిందని ఆరోపించారు. ఆ విద్యా సంస్థలకే ఫీజుల దోపిడీకి పెద్ద పీట వేసిందని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి సభకు అధిక సంఖ్యలో తరలిరావాలి
ముమ్మిడివరం నియోజకవర్గ పర్యటనకు గురువారం ఉదయం ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్న సందర్భంగా అక్కడ జరిగే సభకు శెట్టిబలిజ సామాజిక వర్గీయులు తరలిరావాలని సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. జగన్‌కు శెట్టిబలిజలు భారీ ఎత్తున స్వాగతం పలకాలని ఆయన సూచించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు మట్టపర్తి నాగేంద్ర, గుత్తుల శ్రీనివాసరావు, చప్పడి శోభన్‌బాబు, ఖాదర్, చీకురుమిల్లి కిరణ్‌కుమార్, అడపా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు