కరపత్రాలు పంచితే అరెస్టా?

21 Dec, 2013 03:33 IST|Sakshi
కరపత్రాలు పంచితే అరెస్టా?

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన అనుచరుల అక్రమాలు, అవినీతిపై కరపత్రాలు పంచినందుకు తన భర్త శ్రీరామ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసకు గురిచేశారంటూ ఇఫ్లూ విద్యార్థిని వి.స్వరూప దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. కరపత్రాలు పంచితేనే అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. బాధితుడిని పోలీసులు నిజంగానే హింసించారా? అతని శరీరంపై గాయాలు ఉన్నాయా? ఉంటే వాటి తీవ్రత ఏమిటి? తదితర అంశాలను నిగ్గు తేల్చేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేసింది.

ఇందులో నిమ్స్, అపోలో, కేర్ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు సభ్యులుగా ఉంటారు. విచారణ జరిపి మంగళవారం నాటికి నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, కరీంనగర్ జిల్లా పోలీసుల నుంచి తన భర్త శ్రీరామ్‌కు ప్రాణహాని ఉందని, అండర్‌ట్రైల్ ఖైదీగా ఉన్న అతనికి తగిన భద్రత కల్పించడంతో పాటు సరైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించేలా అధికారులను ఆదేశించాలంటూ స్వరూప గురువారం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆమె పిటిషన్‌పై జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం విచారించారు. శ్రీరామ్ ఇఫ్లూ ప్రాంగణం బయట ఉండగా, ఈ నెల 9న సివిల్ డ్రస్‌లో వచ్చిన కొందరు వ్యక్తులు బలవంతంగా తీసుకువెళ్లారని పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ కోర్టుకు నివేదించారు.
 
 మంత్రిపైనే కరపత్రాలు పంచుతావా అంటూ విచారణ సమయంలో శ్రీరామ్‌ను పోలీసులు దారుణంగా హింసించారని తెలిపారు. మంత్రి ప్రోద్భలంతోనే పోలీసులు ఇలా చేస్తున్నారన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, బాధితుడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను తన ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి విచారణ ప్రారంభం కాగానే... శ్రీరామ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పత్రాలను ప్రభుత్వ సహాయ న్యాయవాది న్యాయమూర్తి ముందుంచారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. బాధితుడిని వెంటనే హైదరాబాద్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించాలని పోలీసులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు