చెప్పేదొకటి.. చేసేది మరొకటి

13 May, 2018 13:16 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న శిల్పాచక్రపాణిరెడ్డి

చంద్రబాబువన్నీ పచ్చి అబద్ధాలు

రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు

80వేల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో చెప్పాలి

వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి  

సాక్షి, ఆత్మకూరు : జిల్లాకు వచ్చినప్పుడల్లా సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని, అభివృద్ధి మాత్రం జిల్లా కూడా దాటడం లేదని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చెప్పేదొకటి..చేసేది మరొకటిగా మారిందన్నారు. 2014లో జిల్లాకు 35 హామీలు ఇచ్చారని, నాలుగేళ్లయినా ఒక్కటీ నెరవేరలేదన్నారు. జిల్లాకు రూ. 80 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, అభివృద్ధి ఎక్కడ జరిగిందో ముఖ్యమంత్రి చూపించాలని సవాల్‌ విసిరారు. 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చెబుతున్నారని, అలా జరిగివుంటే చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. ఒక్క పర్మినెంట్‌ ఉద్యోగం అయినా ఇచ్చారా? కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్లో ఒక్కరినైనా రెగ్యులర్‌ చేశారా అని ప్రశ్నించారు.

పట్టిసీమ నుంచి రాయలసీమకు 140 టీఎంసీల నీరు ఇచ్చానని గొప్పలు చెబుతున్నారని, మరి సీమలో రెండో పంట సాగు చేయొద్దని ప్రభుత్వం ఎందుకు చెప్పిందని చక్రపాణిరెడ్డి ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటుంటే.. రాష్ట్రంలో రైతులు పండగ చేసుకుంటున్నారని సీఎం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీశైలం  నీటిని కోస్తాకు తరలించి..రాయలసీమకు సాగుకు ఇస్తానని చెప్పుకోవడం శోచనీయమన్నారు.   ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచింది తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న ధర్మ దీక్షలు ..ప్రజలను పక్కదోవ పట్టించడానికేనన్నారు.

 వైఎస్సార్‌సీపీ పాదయాత్రలు విజయవంతం చేయండి:  
ప్రజా సంకల్పయాత్ర 2000 కి.మీ మైలురాయిని ఈనెల 14న దాటనుండడంతో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15న సంఘీభావ పాదయాత్రలను చేపడుతున్నామని, వాటిని ప్రజలు విజయ వంతం చేయాలని శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. మహానంది మండలం తిమ్మాపురం నుంచి వెలుగోడు మండలం మోతుకూరు వరకు తాము పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు.  సమావేశంలో పార్టీ నాయకులు శిల్పా భువనేశ్వర రెడ్డి, చిట్యాల వెంకటరెడ్డి, బాలన్న, ఎలిషా, నాగేశ్వరరెడ్డి, కరిముల్లా, స్వామి, పుల్లారెడ్డి, రాజగోపాల్‌ పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు