కొండపల్లిలో శిల్పారామం!

20 Dec, 2014 00:38 IST|Sakshi
కొండపల్లిలో శిల్పారామం!

15 ఎకరాలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం
వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు కసరత్తు
ఆలస్యమైతే కేంద్రం ఇచ్చిన రూ.5కోట్లు వృథా  

 
ప్రతిష్టాత్మక శిల్పారామం కొండపల్లి ఖిల్లా సమీపంలో ఏర్పాటుచేయాలని జిల్లాయంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఖిల్లా సమీపంలో ఉన్న 15 ఎకరాలను ఇందుకు కోసం కేటాయించాలని  నిర్ణయించింది.
 
విజయవాడ : నవ్యాంధ్ర రాజధానికి కేంద్రమైన విజయవాడలో ప్రతిష్టాత్మక శిల్పారామం ఏర్పాటు పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో స్థలాలను అన్వేషిస్తోంది. ప్రాథమికంగా కొండపల్లి అనుకూలమని, ఇక్కడ 15 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధమని అధికారులు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తొలుత భవానీద్వీపంలో ఏర్పాటుచేయాలని భావించారు. ఇందుకోసం 20 ఎకరాలు కేటాయించాలని గతంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) ఎండీగా వ్యవహరించిన చందనాఖాన్ ఆదేశించారు. అయితే, ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించడంతో జిల్లా యంత్రాంగం మళ్లీ స్థలం కోసం అన్వేషిస్తోంది. ప్రస్తుతం కొండపల్లి ఖిల్లా సమీపంలో 15 ఎకరాల భూమి ఉందని, దాన్ని ఏపీటీడీసీకి కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనికి శిల్పారామం సొసైటీ సానుకూలంగా స్పందిస్తుందా లేదా అని దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
 
రూ.5 కోట్లకు గ్రహణం
 
నగరంలో శిల్పారామం ఏర్పాటుకు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సుమారు రూ.5కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులు వచ్చే ఏడాది మార్చిలోపు వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు స్థలం కేటాయించకపోవడంతో సకాలంలో పనులు ప్రారంభమవుతాయా.. అనే సందేహం నెలకొంది. సకాలంలో పనులు ప్రారంభంకాకపోతే నిధులు వెనక్కి వెళ్లిపోతాయి.

మరిన్ని వార్తలు