యమపాశాలు

31 Jul, 2014 02:26 IST|Sakshi
 •     విద్యుత్ తీగలు తెగిపడి  షాక్‌కు గురై ఇద్దరి మృతి
 •   ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరు
 •   మృతులిద్దరూ మేనత్త, మేనల్లుడు
 •   జంక్షన్‌లో ఘోర ప్రమాదం
 • విద్యుత్ తీగలు యమపాశాలై రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. చెట్టుకొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో స్తంభం కూలిపోయింది. తీగలు తెగి ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిపై పడటంతో అతడిని కాపాడేందుకు తల్లి, మేనత్త యత్నించారు. ఈ ఘటనలో బాలుడితోపాటు అతడి మేనత్త మరణించారు. తల్లి షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పొందుతోంది. హనుమాన్‌జంక్షన్‌లో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.
   
  హనుమాన్‌జంక్షన్ : విద్యుత్ తీగలు తెగిపడటంతో షాక్‌కు గురై బాలుడు, అతడి మేనత్త మృతిచెందారు. జంక్షన్‌లో బుధవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో బాలుడి తల్లి కూడా షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలిలా ఉన్నాయి... స్థానిక కె.ఎస్.టాకీస్ ప్రాంతంలో సరిపల్లి రాజు కుటుంబం నివాసం ఉంటోంది. రాజు పంచాయతీ వాటర్‌వర్క్స్‌లో కాంట్రాక్టు ఉద్యోగి. అతడి ఇంటి సమీపంలో ఉన్న చెట్టు కొమ్మ బుధవారం విరిగి విద్యుత్ తీగలపై పడింది.

  దీంతో బలహీనంగా ఉన్న విద్యుత్ స్తంభం విరిగి కింద పడిపోయింది. తీగలు తెగి రాజు ఇంటి బయట ఆడుకుంటున్న అతడి కుమారుడు అఖిల్‌బాబు(2)పై పడ్డాయి. సమీపంలో దుస్తులు ఉతుకుతున్న బాలుడి మేనత్త కాటి రాజ్యలక్ష్మి(28), తల్లి దేవమాత విద్యుత్ తీగల్లో చిక్కుకున్న అఖిల్‌ను కాపాడేందుకు యత్నించి, షాక్‌కు గురయ్యారు. దీనిని చూసిన రాజు కుటుంబసభ్యులు, స్థానికులు కూడా వారిని రక్షించేందుకు యత్నించారు. స్థానికంగా ఉంటున్న కానిస్టేబుల్ రవి వారిని అడ్డుకున్నారు. మరికొందరు విద్యుత్‌షాక్‌కు గురవకుండా అప్రమత్తం చేసి పెనుముప్పును నివారించాడు.

  షాక్‌కు గురైన ముగ్గురిని స్థానికులు హుటాహుటిన స్థాని కంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చారు. వైద్యులు పరీక్షించి అఖిల్, రాజ్యలక్ష్మి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ప్రాణాపాయ స్థితిలో  ఉన్న దేవమాతకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. జంక్షన్ సీఐ వై.వి.రమ ణ, ఎస్సై బి.ప్రభాకరరావు, ఏఎస్సై కె.వి.పాండురంగారావు, విద్యుత్‌శాఖ ఏడీఈ డి.జగన్‌మోహనరావు, ఏఈ జె.ఎస్.నాగభూషణం ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు.   
   
  శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
   
  ఒకే కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడటం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఆ కుటుంబంలోని మిగతావారు రోదిస్తుండటం స్థానికులను కలచి వేసింది. కొన్ని నెలల కిందట కుమారుడిని ప్రసవించిన రాజ్యలక్ష్మిని సారెతో ఏలూరులోని అత్తారింటికి గురువారం పంపించేందుకు కుటుంబసభ్యులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఫోన్‌లో భర్తకు సంతోషంగా చెప్పిన రాజ్యలక్ష్మి.. బుధవారం నాటి దుర్ఘటనలో అకాల మరణం చెం దింది.

  ఆమెకు పసికందుతోపాటు మరో కుమార్తె ఉన్నారు. తల్లి మరణించిందన్న విషయం గ్రహించలేని నెలల పసికందు ఘటనాస్థలికి వచ్చిన వారిని అమాయకంగా చూస్తుండటం స్థాని కులను ఆవేదనకు గురిచేసింది. గన్నవరం ఎమ్మెల్యే వి.వంశీమోహన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు తదితర నేతలు మృతుల కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.
   
  న్యాయం కోసం ఆందోళన
   
  ఈ ఘటనకు సంబంధించి న్యాయం చేయాలంటూ రెండు మృతదేహాలతో సరిపల్లి రాజు కుటుంబసభ్యులు, గ్రామస్తులు విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులు దుట్టా శివన్నారాయణ, దయాల విజయనాయుడు, కైలే అనిల్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, సర్పంచ్ కాకాని అరుణ, ఉప సర్పంచ్ కాకాని వెంకటేశ్వరరావు(బాబు), స్రవంతి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్, టీడీపీ నాయకులు దయాల రాజేశ్వరరావు తదితర నాయకులు ఇందులో పాల్గొన్నారు.

  ఎమ్మెల్యే వంశీమోహన్ అక్కడకు వచ్చి విద్యుత్ ఏడీఈ జగన్‌మోహనహనరావు, తహశీల్ధార్ గోపాలకృష్ణ, సీఐ వై.వి.రమణతో చర్చలు జరిపారు. రాజ్యలక్ష్మి కుటుంబానికి రూ.2 లక్షలు, అఖిల్ కుటుంబానికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లిందుకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నుండి మౌఖికంగా హామీ లభించింది. దీంతో ఎమ్మెల్యే సూచనల మేరకు వారు అందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
   

మరిన్ని వార్తలు