కిషోర్‌ చంద్రదేవ్‌కు షాక్‌

18 Mar, 2019 09:43 IST|Sakshi

సాక్షి, పాలకొండ: ఎట్టకేలకు పాలకొండ టీడీపీ టికెట్‌ నిమ్మక జయకృష్ణకు ఖరారు చేశారు. ఆ పార్టీ తరఫున అరకు పార్లమెంటు అభ్యర్థిగా రంగంలో ఉన్న కిషోర్‌ సూర్య చంద్ర సూర్యనారాయణదేవ్‌ తాను సూచించిన వ్యక్తికి కేటాయించాలని చంద్రబాబునాయుడుని కోరినా.. చివరకు మంత్రి కళా వెంకటరావు మాటే నెగ్గింది. అరకు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒక్క పాలకొండ టికెట్‌ మాత్రమే తను సూచించిన వ్యక్తికి కేటాయించాలని సీఎంను కోరారు.  ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న జయకృష్ణపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు కుమార్తెకు టికెట్‌ అందించాలని కోరారు. దీంతో కొంత కాలంగా పాలకొండ టీడీపీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు తేల్చలేదు. జయకృష్ణకు వ్యతిరేకంగా పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట మండల స్థాయి నాయకులు ఫిర్యాదులు అందించారు. జయకృష్ణకు టికెట్‌ ఇస్తే పార్టీ కోసం పనిచేసేది లేదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో జయకృష్ణ స్థానంలో మరో వ్యక్తిని తెరపైకి తీసువస్తారన్న ప్రచారం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కమిడి కళావెంకటరావును నమ్ముకుని టికెట్‌ ఆశించిన జయకృష్ణ ఆయన ఆశీస్సులతో ఎట్టకేలకు టికెట్‌ సాధించారు. 

భగ్గుమన్న అసమ్మతి
నేరుగా చంద్రబాబునే కలిసి తమ వాదన వినిపించి అభ్యర్థిని కొత్తవారిని తీసురావాలని కోరినా చివరకు జయకృష్ణకే టికెట్‌ కేటాయించడంపై ప్రత్యర్థి వర్గాలు భగ్గుమంటున్నాయి. ఆదివారం అత్యవసరంగా సమావేశమైన వీరు తమ కార్యాచరణపై చర్చించారు.కిషోర్‌తో సమావేశమై తమ వాదన వినిపించారు. అభ్యర్థిని మార్చాలని, లేకపోతే కిషోర్‌ పోటీ నుంచి తప్పుకునేలా ప్రతిపాదన చేయాలని పట్టుపడుతున్నారు. దీంతో పాలకొండ పంచాయితీ మరోమారు చంద్రబాబు వద్దకు చేరింది.   

మరిన్ని వార్తలు