రవాణాశాఖలో ప్రకంపనలు!

3 May, 2018 11:31 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : చిరుద్యోగంలో వుండి కోట్లకు కోట్లు వెనుకేసుకున్న రవాణాశాఖ అటెండర్‌ నరసింహారెడ్డి అక్రమాస్తుల కేసులో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రవాణాశాఖలోని కొంతమంది ఉన్నతాధికారులకు అతను ఓ బినామీ తేలుతుండటంతో ఆ శాఖలో ఈ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఏసీబీ దాడుల్లో నరసింహారెడ్డి పట్టుబడటంతో తమ పేర్లు ఎక్కడ బయటకొస్తాయోనని.. కొందరు అవినీతి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.

డీటీసీ, ఆర్టీవోగా పనిచేసిన ఇద్దరు అధికారులకు నరసింహారెడ్డి బినామీగా వ్యవహరించినట్టు ఏసీబీ భావిస్తోంది. నెల్లూరు డీటీసీగా పనిచేసిన మోహన్‌రావు ఇంటిపై గతంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. మోహన్‌రావు పేరిట రూ. వెయ్యికోట్లకుపైగా ఆస్తులు గురించింది. మోహన్‌రావు వెనుక ఐఏఎస్‌ అధికారి ఉన్నట్టు ఏసీబీ విచారణలో వెలుగుచూసింది. మరో ఇద్దరు ఆర్టీవోల ఆస్తులపైన ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

అటెండర్‌ అక్రమాస్తుల చిట్టా..
ఒకటి కాదు.. రెండు కాదు..రూపాయలు 100 కోట్లు.. ఈ ఆస్తులు ఏ బిజినెస్‌ టైకూనువో కాదు.. ఓ సాదాసీదా చిరు ఉద్యోగివి. రవాణా శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తివని అంటే ఎవరైనా షాక్‌ తింటారు. అతని ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోయారు. కిలోల కొద్దీ బంగారం, పెద్ద ఎత్తున అక్రమాస్తులను గుర్తించారు. కోట్లకు పడగలెత్తిన అటెండర్‌ నరసింహారెడ్డి అక్రమాస్తుల చిట్టా తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉంది. నెల్లూరు ఆర్టీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న నరసింహారెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎంవీ అగ్రహారంలోని ఆయన ఇంటితో పాటు కాపువీధిలోని అతడి సోదరుడు నరహరిరెడ్డి, పుత్తా ఎస్టేట్‌లోని మరో సోదరుడు నిరంజన్‌రెడ్డి, రాంజీనగర్‌లో నివాసం ఉండే వియ్యంకుడు రేబాల మురళీమెహన్‌రెడ్డి, ఆత్మకూరులో నివాసముండే బావమరిది వరప్రసాద్‌రెడ్డి, బీవీనగర్‌లో ఉండే ఆర్టీఏ ఏజెంట్‌ బీ ప్రసాద్‌ ఇళ్లతోపాటు రవాణా కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.

నరసింహారెడ్డి అక్రమాస్తులివే..

  • నరసింహారెడ్డి పేరు మీద గుండ్లపాళెంలో 3.95 ఎకరాల భూమి
  • కొండాయపాళెంలో 200చదరపు గజాల ఇంటి స్ధలం
  • నరసింహారెడ్డి భార్య హరిప్రియ పేరుపై గుండ్లపాళెంలో 6.5ఎకరాల భూమి
  • సంగం మండలం పెరమనలో 35.30ఎకరాల వ్యవసాయ భూమి
  • నెల్లూరులోని ఎంవీ అగ్రహారంలో 346 చదరపు గజాల ఇంటి స్థలం
  • శ్రీహరినగర్‌లోని సుబ్బారెడ్డినగర్‌ లేఅవుట్‌లో 240చదరపు గజాలు
  • కొండాయపాళెంలో 266 చదరపు గజాల ఇంటి స్ధలాలు
  • గుండ్లపాళెంలోని వివేకానంద లేఅవుట్‌లో 10 ఇళ్ల స్థలాలు
  • ఎంవీ అగ్రహారంలో జీ ప్లస్‌ 2 ఇల్లు
  • అత్త నారాయణమ్మ పేరుమీద పెరమనలో 4.6 ఎకరాల వ్యవసాయ భూమి

ఇవి కాకుండా ఇంట్లో 7లక్షల 70వేల రూపాయల లక్షల నగదు, బ్యాంకులోని రూ.20లక్షల నగదు, ఇంట్లో 2 కేజీల బంగారం, 7 కిలోల వెండి ఆభరణాలను గుర్తించారు ఏసీబీ అధికారులు. దీంతోపాటు కోటి రూపాయల విలువైన ఎల్‌ఐసీ డిపాజిట్లు, 10లక్షల మేరకు ఎల్‌ఐసీ పాలసీలు బయటపడ్డాయి. ఇక భార్య, కుమార్తె పేరిట ఉన్న లాకర్లును తెరిచి చూస్తే కళ్లు జిగేల్‌మనేలా కేజీల కొద్ది బంగారం బయపడింది. లాకర్లలోని బంగారు ఆభరణాలు దాదాపు 4 కేజీల వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటెండర్‌ నరసింహారెడ్డిని అరెస్టు చేశారు. అతనికి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.

1984లో అటెండర్‌గా విధుల్లోకి..
నెల్లూరు కాపువీధికి చెందిన కరాదు నరసింహారెడ్డి 1984లో రవాణాశాఖలో అటెండర్‌గా విధుల్లో చేరారు. ప్రస్తుతం నెల్లూరు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో చేరిన నాటినుంచి ఉన్నతాధికారులకు అన్నీ తానై వ్యవహరించేవాడని సమాచారం. నరసింహారెడ్డికి పదోన్నతులు వచ్చినా.. కాదని 34 ఏళ్లుగా ఒకేచోట ఆఫీసు సబార్డినేటర్‌గానే విధులు నిర్వహిస్తున్నాడు. చూసేందుకు సాదాసీదాగా కనిపించే ఇతను మామూళ్ల వసూలులో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తాడని సమాచారం. తన వాటా కింద రావాల్సిన మొత్తంలో రూపాయి తగ్గినా ఒప్పుకోడని, ఆఫీసులోని పై అధికారులకు వాటాలు పంచడంలోనూ అంతే కచ్చితంగా ఉంటాడని సమాచారం. రోజువారీ సంపాదనతో నరసింహారెడ్డి ఏదో ఒక ఆస్తి కొనేవాడని తెలుస్తోంది. మొదట పొలాలు కొని,  ఆ తరువాత రియల్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇతడి కుటుంబ సభ్యుల పేరిట 18 ప్లాట్లు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. రియల్‌ భూం తగ్గిపోవడంతో నరసింహారెడ్డి తన పెట్టుబడులను తెలివిగా బంగారం వైపు మళ్లించాడని ఏసీబీ అధికారులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు