కబ్జా చేసి..షాపులు నిర్మించి..!

18 Sep, 2019 10:24 IST|Sakshi
నేరేడు కర్ర చెరువు గర్భంలో నిర్మించిన షాపులు

దురాక్రమణలో బలిజిపేట నేరేడుకర్ర చెరువు

5.85 ఎకరాల చెరువు గర్భంలో 3 ఎకరాల ఆక్రమణ

స్థలాల అమ్మకాలు, పక్కా భవనాల నిర్మాణం

మొద్దునిద్రలో రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ శాఖల అధికారులు

సాక్షి, బలిజిపేట: బలిజిపేటలోని నేరేడుకర్ర చెరువు గర్భం కబ్జా బారిన పడింది. ఆక్రమణదారులు స్థలాల విక్రయాలు చేస్తున్నారు. పక్క షాపులు నిర్మించి అద్దెలకు ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. సర్వే నంబర్‌ 61–6లో ఉండే నేరేడుకర్ర చెరువు గర్భం 5.85 ఎకరాలు. దానిలో సుమారు 3 ఎకరాలకు పైగా ఆక్రమణల బారిన పడిందని స్థానికులు చెబుతున్నారు. బలిజిపేట బస్టాండ్‌ నుంచి నారాయణపురం రోడ్డులోని సెవెంత్‌ డే వరకు దురాక్రమణ జరిగినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.

బడాబాబులకే మేలు..
వాస్తవానికి చెరువు కబ్జా చేసిన వారిలో బడాబాబులే ఎక్కువగా ఉన్నారు. అదేదో వారి సొంత స్థలంలా ఆక్రమించేసి, షాపులు నిర్మించేసి, అద్దెలకు ఇచ్చేసి, పెద్ద ఎత్తున ప్రభుత్వానికి రావాల్సిన ధనాన్ని దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. కనీసం ఆ షాపులనైనా వారి చేతుల్లోకి తీసుకుంటే పంచాయతీకి పెద్ద మొత్తంలోం ఆదాయం వచ్చేదని, చిరు వ్యాపారులకు అద్దెకు ఇస్తే బాగు పడేవారని పేర్కొంటున్నారు. బస్టాండ్‌ పక్కనే ఉన్న స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించి, షాపు నిర్మించి బేకరీకి అద్దెకు ఇచ్చాడు. దానికి రూ.4వేల అద్దె తీసుకుంటున్నాడు. అలాగే నారాయణపురం రోడ్డులో కొన్ని భవనాలు నిర్మించారు. అక్కడ ఒక ఎరువుల షాపునకు రూ.2వేల అద్దె చెల్లిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దురాక్రమణలో భాగంగా నిర్మించిన ఓ షాపును టీడీపీ నాయకుడు కొనుగోలు చేసి వైన్‌షాపుకు అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మీటర్లు ఎలా ఇచ్చారో..?
మరోవైపు దురాక్రమణలో ఉన్న షాపులకు విద్యుత్‌ శాఖ వారు మీటర్లను మంజూరు చేశారు. ఇది ఎలా సాధ్యమైందని స్థానికులు చర్చించుకుంటున్నారు. నిజానికి మీటర్‌ మంజూరు చేయాలంటే కార్యదర్శి అనుమతి పత్రం ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంది. అలా చూస్తే ఆయా స్థలాలకు అసలు డాక్యుమెంట్లే ఉండవు. అవి లేకుండా మీటర్లు ఎలా వచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే చెరువు గర్భంలో దురాక్రమణ జరిపి నిర్మించిన షాపులకు సంబంధించిన పన్నులను పంచాయతీ అధికారులు వసూలు చేయడం లేదు. ఎందుకు పన్నులు కట్టించుకోవడం లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రూ.4వేలు అద్దె కడుతున్నా..
బేకరి పెట్టుకునేందుకు షాపు వెతుకుతుంటే దొరికింది. రూ.4వేలు అద్దె చెల్లించి షాపు తీసుకున్నా. మిగిలిన విషయాలు నాకేం తెలియవు.
– ఇంద్ర, వ్యాపారి.

పరిశీలిస్తా..
విద్యుత్‌ మీటర్ల మంజూరుకు అనుమతిపత్రం ఉండాలి. ఆధార్, స్థల డ్యాక్యుమెంట్లు ఉండాలి. దురాక్రమణ షాపులకు మీటర్లు ఎలా ఇచ్చారో ఒక సారి పరిశీలిస్తా. అధికారులకు వివరాలు అడుగుతా.
– శశిభూషణ్, ఎలక్ట్రికల్‌ ఏఈ, బలిజిపేట.

చర్యలు తీసుకుంటా..
నేను మండలానికి కొత్తగా బదిలీపై వచ్చాను. ఏ విషయంపైనా నాకు అవగాహన లేదు. దురాక్రమణ విషయం దృష్టికి వచ్చింది. పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటా.
– సత్యనారాయణ, డీటీ, బలిజిపేట.

మరిన్ని వార్తలు