కడలి కోత

28 Sep, 2019 13:15 IST|Sakshi
నరసాపురం మండలం చినమైనవానిలంక వద్ద ఒడ్డు కోతకు గురైన చిత్రం

వణుకుతున్న తీరప్రాంత గ్రామాలు

వందలాది ఎకరాల భూములు సాగర గర్భంలోకి..

కానరాని రక్షణ చర్యలు ప్రతిపాదనలు బుట్టదాఖలు

జిల్లాలోని తీరప్రాంతంలో కడలి కోత కంటిమీదకునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే వందలాది ఎకరాల భూములు సాగర గర్భంలో కలిసిపోయాయి. అయినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అప్పట్లో పెట్టిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. కేంద్రమంత్రి నిర్మలా సీతా రామన్‌ తీర గ్రామాన్ని దత్తత తీసుకున్నా.. ఫలితం లేదు.

నరసాపురం రూరల్‌: జిల్లాలోని సముద్ర తీర ప్రాంతానికి పెద్ద ముప్పు పొంచి ఉంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం చిన్నగా మొదలైన సముద్రపు కోత నేడు తీవ్రమైంది. దీంతో జిల్లాలోని 19 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీర ప్రాంతంలో ముఖ్యంగా మూడు కిలోమీటర్ల పరిధిలో (చినమైనవానిలంక నుంచి పెదమైనవానిలంక వరకు)  గ్రామాలకు సముద్రపు కోత రూపంలో ఏ క్షణాన్నయినా ఉపద్రవం సంభవించే ప్రమాదం లేకపోలేదు. తుపానుల ప్రభావంతో సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా వందలాది ఎకరాల విస్తీర్ణం కలిగిన జిరాయితీ భూములు సముద్రగర్భంలో కలిసిపోయాయని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. కొబ్బరి, తాడిచెట్లతోపాటు సర్వే తోటలు కూడా కడలి గర్భంలో కలిసి పోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

250 ఎకరాలపైనే.. 2002 నుంచి సముద్ర గర్భంలో భూములు కలిసిపోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 250 ఎకరాలకుపైనే పంటభూమి కడలిలో కలిసిపోయింది. ఏటా తుపాన్ల వల్ల కొంతమేర భూమి కలిసిపోతున్నా.. అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు. ఇప్పటికైనా కోత నివారణకు యుద్ధ ప్రాతిపదికన యత్నాలు చేయకపోతే మరో రెండు దశాబ్దాలకు సముద్రం మరింత ముందుకొచ్చి చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వాదనను అధికారులు సైతం కొట్టి పారేయలేకపోతున్నారు.

రక్షణ గోడకు ప్రతిపాదనలు
ఈ ప్రాంతంలో ముందుగా చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాలు సముద్రపు కోతకు గురి కావడంతో పెదమైనవానిలంక గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చినమైవానిలంక నుంచి పెదమైనవానిలంకగ్రామ శివారు వరకు సిమెంట్‌తో కూడిన భారీ రాళ్లతో ఒడ్డునే రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాదించారు. 2015లో  గోవా  రాష్ట్రం నుంచి ప్రత్యేక కేంద్ర  బృందం ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో తీరప్రాంత రక్షణకు సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు కాగలదని అంచనా వేసింది. అయితే  అప్పటి ప్రభుత్వం మాత్రం కోత నివారణకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. గతంలో కూడా సముద్రకోతను అడ్డుకునేందుకు పలువురు కలెక్టర్లు చేసిన ప్రతిపాదనలనూ అప్పటి ప్రభుత్వాలు నిధుల కొరత కారణం చూపుతూ వాయిదా వేశాయి. ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలు మాత్రమే తీసుకున్నాయి. భూములను కోల్పోయిన రైతులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలాంటి ప్రత్యామ్నాయ భూమిని ప్రభుత్వం అందించలేకపోయింది. 

సునామీ తర్వాత సముద్రం కోత
2004లో సునామీ ప్రభావం తర్వాతనే ఈ ప్రాంతంలో సముద్ర కోత పెరిగింది. థానే, నీలం, లైలా, హుద్‌హుద్, ఫొని తదితర తుపాన్ల ప్రభావం వల్ల కోత తీవ్రమైంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు  కోరుతున్నారు.  

చిన్నప్పటి నుంచి కోతను చూస్తున్నా
నాకు తెలుసుండి పాత బియ్యపుతిప్ప, చినమైనవానిలంక గ్రామాల్లో తిరిగాను. నేను చూస్తుండగానే ఆ గ్రామాలు సముద్రగర్భంలో కలిసిపోయాయి. అక్కడ తోటలు, సాగుభూమి కూడా ఉండేవి. భవిషత్తులో ఇదే పరిస్థితి తలెత్తితే  ఇప్పుడున్న కాస్త ఊరు కూడా సముద్రంలో కలిసిపోయే ప్రమాదముంది. ప్రభుత్వం  సముద్రకోత నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.– ఒడుగు జనార్దనరావు, చినమైనవానిలంక

కోత నివారణకు చర్యలు చేపట్టాలి
మా ప్రాంతంలో సముద్ర కోత రోజురోజుకీ పెరిగిపోతోంది. అప్పట్లో నిర్మలా సీతారామన్‌  మా గ్రామాన్ని దత్తత తీసుకున్న సమయంలో కోత నివారణకు రక్షణగోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంత వరకు రక్షణ గోడ నిర్మాణానికి పూనుకోలేదు. తక్షణం  గోడ నిర్మాణం తలపెట్టకపోతే భవిష్యత్తులో మా ఊరు సముద్రంలో కలిసిపోవడం ఖాయం.– మైల వెంకన్న, పెదమైనవానిలంక

మరిన్ని వార్తలు