సేవలు.. అపస్మారకం

15 Oct, 2017 15:20 IST|Sakshi

తని పేరు భాస్కర్‌(30). నగరంలోని నాయక్‌నగర్‌ నివాసి. తీవ్ర అనారోగ్యంతో ప్రభుత్వాసుపత్రిలోని ఏఎంసీలో చికిత్స పొందుతున్నాడు. శనివారం ఉదయం నుంచి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం వల్ల వెంటిలేటర్‌ పనిచేయకపోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల విద్యార్థిని అంబూబ్యాగ్‌ సహాయంతో శ్వాసను అందించడంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది.

అనంతపురం న్యూసిటీ: సీజనల్‌ వ్యాధులు.. డెంగీ.. డయేరియా.. ఇతరత్రా రోగాలు జిల్లా ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ప్రతి రోజూ మరణాల సంఖ్య పదుల సంఖ్యలో ఉంటోంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి సేవలే పెద్దదిక్కు. ఇక్కడ రోజూ 2వేల మంది ఔట్‌ పేషెంట్లు, 1200 వరకు ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. ఇటీవల ఇక్కడ గంటల వ్యవధిలో తొమ్మిది మంది మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైద్యుల కొరతతోనే ఈ పరిస్థితి నెలకొందనే విషయం ఆ సందర్భంగా బట్టబయలైంది. ఇప్పటికీ ఆసుపత్రిలో వైద్యుల కొరత అలానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తన సొంత నియోజకవర్గం రాయదుర్గంలో తల్లి స్మారకార్థం శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న శిబిరం అభినందనీయమే అయినా.. ప్రభుత్వ విధుల్లోని వైద్యుల సేవలను వినియోగించుకోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు 51 మంది వైద్యులు ఆ శిబిరంలో సేవలందిస్తున్నారు. వీరిలో 32 మంది రెగ్యులర్‌ వైద్యులు కాగా.. 19 మంది హౌస్‌ సర్జన్లు. వాస్తవానికి ప్రభుత్వ వైద్య కళాశాలకు 255 మంది వైద్యులు అవసరం కాగా.. ప్రస్తుతం 174 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో 80 నుంచి 90 మంది సర్వజనాసుపత్రిలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కళాశాల నుంచి ముగ్గురు మాత్రమే డెప్యూట్‌ కాగా.. ఆసుపత్రి నుంచే అధిక సంఖ్యలో వైద్యులను తరలించడం గమనార్హం.

స్తంభించిన వైద్య సేవలు
వైద్యులు లేకపోవడంతో ఆస్పత్రిలో వైద్య సేవలు స్తంభించాయి. ఏఎంసీ, ఎమర్జెన్సీ, లేబర్, ఆంటీనేటల్, చిన్న పిల్లల విభాగం, ఆర్థో, ఐడీ తదితర వార్డుల్లో వైద్యులు పూర్తి స్థాయిలో లేరు. ఇక హౌస్‌ సర్జన్ల బాధ్యత స్టాఫ్‌నర్సులు నిర్వహించడం గమనార్హం. రేడియాలజీ, రక్త పరీక్షలకు బ్రేక్‌ పడింది. రోజూ 40 నుంచి 50 స్కానింగ్, 180 ఎక్స్‌రేలు, 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో సగం సేవలు కూడా శనివారం అందకపోవడం చూస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది. చివరకు అత్యవసర స్కానింగ్‌లను బయటకు పంపారు.

కరెంటు కష్టాలు
ఆస్పత్రిలో ఉదయం నుంచి కరెంటు కష్టాలతో రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏఎంసీ, ఎమర్జెన్సీ వార్డు, కాన్పుల వార్డు, చిన్నపిల్లల విభాగం, గైనిక్, రేడియాలజీ విభాగాల్లో కరెంటు పోయింది. ఆస్పత్రికి విద్యుత్‌ సరఫరా చేసే కేబుల్‌ కాలిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఇద్దరు టెక్నీషియన్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడటంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ట్రాన్స్‌కో అధికారులు కూడా ఆలస్యంగా స్పందించినట్లు తెలుస్తోంది. అదే సూపరింటెండెంట్‌ అందుబాటులో ఉంటే సకాలంలో వైద్య సేవలు అందడంతో పాటు సమస్యను త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉండేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఎలాంటి సమస్యా లేదు
తక్కువ సంఖ్యలోనే వైద్యులను శిబిరానికి డిప్యూట్‌ చేశాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. హౌస్‌సర్జన్లనే అధికంగా శిబిరానికి పంపాం. రేపు ఎలానూ ఆదివారమే. ఇబ్బందేమీ లేదు.
– డాక్టర్‌ జగన్నాథ్,
సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి

మరిన్ని వార్తలు