చనిపోయినా.. కను‘గుడ్’

7 Sep, 2014 01:44 IST|Sakshi
చనిపోయినా.. కను‘గుడ్’

అమ్మానాన్నలు.. తోబుట్టువులు.. బంధువులు..స్నేహితులు..ఇలా అంతా ఉన్నా.. ఆరోగ్యంగానే ఉన్నా.. చూపులేనికారణంగా అంధులు అన్ని ఆనందాలకు దూరమవుతారు. నిత్యం ఆవేదనలో మునిగిపోతారు. జన్యులోపాలు లేదా పుట్టుకతో అంధులుగా మారినవారు.. ప్రమాదాల్లో కార్నియా పోగొట్టకున్నవారు వెలుగు చూడకుండా బతుకుతున్నారు.

వీరిలో చాలామందికి చూపు తెప్పించే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కావాల్సిందే చనిపోయినవారి నేత్రాలు సేకరించి అమర్చడమే! దురదృష్ట వశాత్తు నేత్రదానంపై నేటి సమాజంలో ఇప్పటికీ పూర్తిస్థాయి చైతన్యం కలగలేదు. ప్రస్తుతం దేశంలో లక్షలాదిమంది కార్నియా అంధత్వంతో బాధపడుతున్నారు. రోజూ ఎంతోమంది లోకం విడిచివెళుతున్నా.. కేవలం 20 వేలకు మించి కార్నియాలు లభ్యం కావడంలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయితే 1575 కార్నియాలే సేకరించగలుగుతున్నారు.

 నేత్రదానం వీరు చేయవచ్చు..
ఏనిమిదేళ్ల నుంచి 80 ఏళ్ల వయసున్న వ్యక్తులు చనిపోయిన సందర్భాల్లో వారి నుంచి కార్నియాలను సేకరించవచ్చు.
శుక్లాలు ఉన్నవారు, కంటి ఆపరేషన్ చేయించుకున్నవారివి కూడా పనికొస్తాయి. అయితే కార్నియా దెబ్బతినకుండా ఉండాలి.
మధుమేహం, గుండెజబ్బులు, చత్వారం ఉన్నవారు సైతం నేత్రదానం చేయవచ్చు.
ప్రమాదాల్లో, అనుమానాస్పదంగా మరణించిన వారి నుంచి చట్టపరమైన అనుమతులు తీసుకున్న తర్వాత కార్నియా సేకరించే అవకాశం ఉంటుంది.

 
 వీరు అనర్హులు
పిచ్చి కుక్కు కరచి.. ర్యాబిస్ వ్యాధితో మరణించవారి నుంచి కార్నియాలు సేకరించకూడదు.
హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు.. కారణం తెలియకుండా మరణించవారి నేత్రాలు కూడా పనికిరావు.
క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధులతో మరణించిన వారి నుంచి కార్నియాలు సేకరించకూడదు.

మరిన్ని వార్తలు