కొత్త బండి.. జేబులకు గండి

10 Jul, 2018 07:34 IST|Sakshi

బైక్‌ కొనాలంటే దడ

రవాణా శాఖ నిబంధనలతో నిర్వాహకుల చేతివాటం

నిర్దేశించిన మొత్తం కంటే అధికంగా వసూళ్లు

సిండికేట్‌గా మారుతున్న షోరూం యజమానులు

కొత్తగా బైక్‌ కొనాలని కొన్ని షోరూంలకు వెళితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకుంటే రవాణా శాఖ నిబంధనలతో పేరుతో షోరూం యజమానులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్, బీమా తదితరాలు వారి వద్దే చేయించుకోవాలనే నిబంధన వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. వారు చెప్పినంత ఇచ్చి బైక్‌ను కొనాల్సిందే. ఇది పలమనేరు పట్టణంలో మాత్రమే కాదు జిల్లా వ్యాప్తంగా సాగుతున్న తంతు.

పలమనేరుకు చెందిన శరత్‌చంద్ర షోరూంలో ఓ బైక్‌ కొన్నాడు. బైక్‌ విలువతోపాటు అదనంగా ఆర్‌సీ, ఇన్సూరెన్స్, లైఫ్‌టాక్స్, నెంబర్‌ ప్లేట్‌కు ఇలా అధికంగానే డబ్బులు గుంజారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీరు ఏ షోరూంకు వెళ్లినా ఇంతేనని సమాధానమిచ్చారు. దీంతో విధిలేక అదనంగా డబ్బులు చెల్లించి బైక్‌ను సొంతం చేసుకున్నాడు.   

పలమనేరు: కొత్తగా వాహనాన్ని కొనేటప్పుడే అందుకు సంబంధించిన మొత్తం ప్రొసెస్‌తో పాటు అవసమైన సర్టిఫికెట్లను షోరూం నిర్వాహులే అందించాలని రవాణాశాఖ ఈ మధ్యనే ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా ఆన్‌లైన్‌లో సాగే ప్రక్రియే. రవాణా శాఖ నిబంధనల మేరకు ఆర్‌సీకి రూ.760, లైఫ్‌టాక్స్‌ బండి విలువలో 9 నుంచి 12శాతం, ఇన్సూరెన్స్‌ రూ.1800,  నంబర్‌ ప్లేటుకు రూ. 250 వసూలు చేయాల్సి ఉంది.

జరుగుతున్న తతంగం ఇలా..
అయితే కొన్ని షోరూంల నిర్వాహకులు ఆర్‌సీకి రూ.1000 నుంచి 1,600, టాక్స్‌ రూ.1200, ఇన్సూరెన్స్‌ రూ.2,200, నంబర్‌ ప్లేటుకు రూ.400 వసూలు చేస్తున్నారు. దీంతోపాటు లైసెన్స్‌ లేకుంటే దాన్ని తామే ఇస్తామంటూ వసూలుకు పాల్పడుతున్నారు. ఇక హెల్మెట్‌లు బయటి మార్కెట్‌కంటే రూ.500 వరకు ఎక్కువగా గుంజుతున్నారు. మొత్తం మీద ఓ బైక్‌కు రూ. 2వేలు అదనంగా ఇవ్వాల్సిందే. జిల్లాలో పలు వాహనాల కంపెనీలకు సంబంధించి సుమారు 220 షోరూంలున్నాయి. అన్ని చోట్ల ఇదే తంతు కొనసాగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. అన్ని చోట్ల సిండికేటే..
పట్టణాల్లోని షోరూం నిర్వాహకులంతా సిండికేట్‌గా మారి అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొనుగోలుదారులు ఏ షోరూంకు వెళ్లినా ఇదే ధరలుంటాయి. దీంతో వారు చెప్పిన ధర ఇచ్చి బైక్‌ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక షోరూంలలో వాయిదాలతో వాహనాలు కొనేవాళ్లపై ఈ వాతలు కాస్త అధికంగానే ఉంటున్నాయి. దీన్ని ప్రశ్నించినా లాభం లేకుండా ఉంది. దీనిపై ఎంవీఐ శివారెడ్డిని వివరణ కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ధరల పట్టికలు పెట్టాలి
ప్రభుత్వం నిర్దేశించిన ధరల వివరాలను సంబంధిత షోరూంల వద్ద రవాణాశాఖ ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలి. షోరూం నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలివ్వాలి. దీనిపై కొనుగోలుదారుకు అవగాహన లేకపోవడంతో దోపిడీ సాగుతోంది.–శరత్‌చంద్ర, పలమనేరు

ఈఎంఐలో అధిక వసూళ్లు
కొనుగోలు సమయంలో మొ త్తం నగదు కట్టి బండి కొనేవాళ్లు రిసిప్టులు చూస్తారు కాబట్టి తెలుస్తుంది. వాయిదాల్లో వాహనాలు కొనేవాళ్ల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. సేవలకు ధరలను పట్టిక రూపంలో షోరూంల వద్ద తెలియజేసేలా చర్యలు తీసుకోవాలి.–చెంగారెడ్డి, కూర్మాయి, పలమనేరు

>
మరిన్ని వార్తలు