జిల్లా ఆస్పత్రిలో నృత్యాలపై సీరియస్‌

19 Feb, 2020 10:37 IST|Sakshi
ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో డ్యాన్సులు వేస్తున్న ఆస్పత్రి ఉద్యోగులు, సిబ్బంది

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో అప్పటి హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌కు సత్కారం పేరుతో సిబ్బంది డీజే పాటలకు చిందులేసిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఆస్పత్రిలోని ఐదుగురు అధికారులకు మంగళవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 10 రోజుల్లోగా సమాధానం చెప్పాలనిఆదేశించినట్టు తెలుస్తోంది. జిల్లా ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నృత్యాలు చేస్తూ హడావుడి చేసిన ఘటనపై ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు.

ఇప్పటికే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై వేటు వేసిన అధికారులు, తాజా గా రెగ్యులర్‌ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయటం సంచలనంగా మారింది. జిల్లా ఆస్పత్రిలో గ్రేడ్‌–1 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ వరలక్ష్మీబాయి, గ్రేడ్‌–2 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ జయకుమారి, డీసీహెచ్‌ఎస్‌లో పనిచేసే ఏడీ పిల్లా ఉమాదేవి, హెడ్‌ నర్స్‌ శాంతకుమారి, సూర్యవతి, ఫార్మసిస్ట్‌ రామకృష్ణలకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీనిపై డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శంకరరావును వివరణ కోరగా  ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి ఆదేశాలు జారీ అయ్యా యని,  రేపు ఉదయం ఉద్యోగులకు నోటీసులు అందజేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు