తస్సాదియ్యా.. రొయ్య..

29 Aug, 2019 10:35 IST|Sakshi

జిల్లాలో తీర ప్రాంత మండలాలు 12 మండలాలు

సాధారణంగా ఏటా రొయ్యల సాగు 1.25 లక్షల ఎకరాలు

ఈ ఏడాది సాగు విస్తీర్ణం 60 వేల ఎకరాలు 

రైతులకు డాలర్ల పంట పండించిన రొయ్యలు.. కొన్నేళ్లుగా ఆటు పోటు ధరలతో కుదేలయ్యారు. తాజాగా వారం రోజులుగా రొయ్యల ధరలు ఊపందుకుంటున్నాయి. గత వారంతో పోల్చితే ప్రస్తుతం అన్ని కౌంట్లపై టన్నుకు రూ.30 వేలు పెరిగింది. పెరుగుతున్న పెట్టుబడుల వ్యయం, నిలకడలేని ధరలతో పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది. ఈ నేపథ్యంలో రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు తస్సాదియ్యా.. రొయ్య.. అంటున్నారు. ప్రస్తుతం ధరలు చూసి సాగుకు దూరంగా ఉన్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో సాగుకు సమాయత్తం అవుతున్నారు.

సాక్షి, గూడూరు(నెల్లూరు):  జిల్లాలోని 12 తీరప్రాంత మండలాల్లో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ధరలు నిలకడగా లేకపోవడం, వైరస్‌లు విజృంభించడం, వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 60 వేల ఎకరాల్లోనే  సాగు చేపట్టారు. ఒకప్పుడు సాగు వ్యయం తక్కువతో డాలర్ల పంట పండింది. ప్రస్తుతం రొయ్యల సాగు వ్యయం గణనీయంగా పెరిగింది.

కానీ ధరలు మాత్రం నిలకడగా లేక రైతాంగం నష్టాలపాలవుతున్నారు. 2013 తర్వాత రొయ్యల ధరలు ఆశించిన మేర లేకపోవడం, నిలకడగా ఉండకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. సొంత గుంతలున్న రైతులు ప్రత్యామ్నాయం లేక సాగు కొనసాగిస్తుంటే, లీజుదారులు పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే ఆశతో సాగు పోరాటం చేస్తున్నారు.

వెంటాడిన వైరస్‌లు
నాసిరకం సీడ్‌తో రొయ్యలను వైరస్‌లు వెంటాయి. వైట్‌గట్, ఈహెచ్‌పీ అనే ప్రోటోజోవా తాకిడితో పెరుగుదల ఆగిపోవడంతో కౌంట్‌కు చేరని పరిస్థితి. వైట్‌ పీకల్, విబ్రియో వంటి వైరస్‌లు సోకడంతో కూడా సాగు వ్యయం బాగా పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఫీడ్‌ ధరలు, ప్రోటిన్లు, కెమికల్స్‌ ధరలు పెరగడంతో పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో నిలకడ లేని ధరలతో రైతులు తీవ్రంగా నష్టాలపాలవుతున్నారు. ఈ సీజన్‌లో వరద తాకిడి ఉన్న తీరప్రాంత మండలాల్లో రొయ్యల సాగు గణనీయంగా పడిపోయింది. జిల్లాలోని కొన్ని మండలాలతో పాటు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం రొయ్యల ధరలు అంతంత మాత్రంగానే ఉండడంతో రొయ్యల గుంతల్లో చేపలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.  

చిగురిస్తున్న ఆశలు
ఆక్వా సాగు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు, ధరల పెరుగుదల, వాతావరణం అనుకూలతలు వెరసి సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. సాగులో ప్రధానంగా విద్యుత్‌ వినియోగం ఖర్చులు రైతులకు పెనుభారంగా మారాయి. గతంలో యూనిట్‌ విద్యుత్‌ చార్జీ రూ.3.80 ఉండేది. ఆక్వా రైతులను కష్టాలను పాదయాత్రలో తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్‌ చార్జీలను యూనిట్‌ రూ.1.50 తగ్గించారు. ఇదే సమయంలో ఈ ఏడాది ప్రస్తుత సీజన్‌లో ధరలు ఆశాజనకంగా పెరిగాయి. ప్రస్తుతం వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆశిస్తున్నారు.

సాగు తగ్గిపోవడంతోనే ధరలు పెరిగాయి 
వర్షాలు లేకపోవడంతో నీటిలో సెలినిటీ శాతం బాగా పెరిగిపోతోంది. ఈ వాతావరణానికి సీడ్‌ సర్వైవల్‌ తగ్గిపోతోంది. వరద తాకిడి ఉన్న ప్రాంతాల్లో సాగు చేపట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రొయ్యల దిగుబడులు తగ్గాయి. ఉత్పత్తి తక్కువగా ఉండడం, డిమాండ్‌ అధికంగా ఉండడంతో ధరలు పెరిగాయి.
– ఎస్‌కే నూర్‌ అహ్మద్, దుగరాజపట్నం, వాకాడు మండలం  

మరిన్ని వార్తలు