తల్లి రొయ్యల యూనిట్‌ను రాబట్టుకునేనా?

6 Jul, 2015 04:27 IST|Sakshi

 ఒంగోలు టౌన్ : ఆక్వా రంగంలో జిల్లాకు పెట్టింది పేరు. ఇక్కడి నుంచి ఎక్కువగా రొయ్యలు ఎగుమతి అవుతుంటాయి. విదేశీ మారక ద్రవ్యం రాబట్టడంలో కూడా జిల్లాకు చెందిన రైతుల పాత్ర ఎంతో ఉంది. అంతటి ప్రాధాన్యత కలిగిన జిల్లాలో తల్లి రొయ్యల యూనిట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం నుంచి వచ్చింది. అదే సమయంలో విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పాటు చేసే విషయమై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. కీలకమైన ఈ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించేందుకు మత్స్యశాఖ కమిషనర్ రామ్‌నాయక్ శనివారం కొత్తపట్నం మండలం పిన్నివారిపాలేన్ని సందర్శించారు.

రాష్ట్రంలో తొలి తల్లి రొయ్యల యూనిట్‌ను జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని  భావిస్తున్నారు. అయితే ఈ యూనిట్‌ను రాబట్టుకోవడంలో జిల్లా ప్రజాప్రతినిధులు పాత్ర ఎంతో ఉంది. 90వ దశకంలో ఆక్వా రంగం జిల్లాలో డాలర్ల వర్షం కురిపించింది. ఎన్ని ఎకరాల మాగాణి భూములు ఉన్నా ఒక్క ఆక్వా చెరువు ఉంటే చాలు అన్న రీతిలో సాగు విరాజిల్లింది. అయితే ఆ తరువాత విచ్చలవిడిగా ఆక్వా చెరువులను తవ్వడం,చెరువుల్లో యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించకపోవడం, అదే సమయంలో నాణ్యమైన సీడ్ రాకపోవడంతో ఒక్కసారిగా ఆక్వా రంగం కుదేలైంది.

గత ఏడాది నుంచి ఆక్వా రంగం తిరిగి పుంజు కుంది. జిల్లా యంత్రాంగం కూడా ఆక్వా సాగు ను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆక్వా సాగు చేసేందుకు ముందుకు వచ్చేవారిని మరిం తగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. అసైన్‌మెంట్ భూమి, వ్యవసాయ యోగ్యతలేని భూములు, పట్టా భూముల్లో ఆక్వా సాగు చేసేందుకు లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలోనే తల్లి రొయ్యల యూనిట్ ఏర్పాటుకు కొత్తపట్నం మండలం పిన్నివారిపాలెం గ్రామంలో స్థలాన్ని మత్స్యశాఖ కమిషనర్ రామ్‌నాయక్ పరిశీలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పరిశీలనతోనే సరిపుచ్చకుండా యూనిట్‌ను రాబట్టుకునేందు కు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. జిల్లా ప్రతినిధులు మౌనంగా ఉంటే కీలకమైన తల్లి రొయ్యల యూనిట్ కోల్పోవడమే కాకుండా ఆ రంగంపై ఆధారపడిన రైతులు నష్టపోవడం ఖాయం.

మరిన్ని వార్తలు