వేతనాల కోసం యుద్ధం

18 Oct, 2018 03:40 IST|Sakshi

ప్రజా సంకల్పయాత్ర బృందం: ప్రతి నెలా వేతనాల కోసం ఎన్‌సీఎస్‌ సుగర్స్‌ యాజమాన్యంతో యుద్ధం చేయాల్సి వస్తోందని శ్రీరామా సుగర్‌ మిల్స్‌ లేబర్‌ యూనియన్‌ కార్యదర్శి ఎన్‌. సన్యాసిరాజు, కోశాధికారులు ఎస్‌. త్రినాథరావు, ఎస్‌. కొండలరావు, తదితరులు అన్నారు. బొబ్బిలి మండలంలోని అప్పయ్యపేట వద్ద సాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం సమర్థవంతంగా నడిపేలా చర్యలు తీసుకుని రైతులు, కార్మికులను ఆదుకోవాలని కోరారు. పరిశ్రమ పరిధిలో సుమారు 18 వేల మంది రైతులు చెరుకు పండిస్తున్నారని తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించడంతో పరిశ్రమ అప్పుల ఊభిలో కూరుకుపోయిందని చెప్పారు.  రైతులకు సుమారు 12 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని.. అలాగే కార్మికులకు జీతాలు కూడా చెల్లించడం లేదని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి నెలా జీతం కోసం యాజమాన్యంతో పోరాడాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పారు. కేవలం యాజమాన్యం అసమర్థత వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రైతులు, చక్కెర కర్మాగార రైతులను ఆదుకోవాలని కోరారు. 

భద్రత లేదు..
ప్రాణాలు ఫణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నా తమ కుటుంబాలకు భద్రత లేకుండా పోయిందని విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సంయుక్త కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ మాట్లాడుతూ,  సుమారు 20 సంవత్సరాలుగా విద్యుత్‌శాఖలో అత్యంత ప్రమాదకరంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

అందరి ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నా తమ బతుకుల్లో మాత్రం చీకట్లు పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి కాంట్రాక్ట్‌ విద్యుత్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆయన అకాల మరణం తర్వాత ఎవ్వరూ పట్టించుకోవడం లేదని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికుల కష్టాలు తెలుసుకోకుండా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లకు మాత్రం దోచిపెడుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరారు.

కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి...
బొబ్బిలిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్‌ మిల్లు మూతపడడం వల్ల సుమారు 2300 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని జూట్‌మిల్లుల లాకౌట్‌ వ్యతిరేక పోరాట ఐక్యపోరాట కమిటీ కన్వీనర్‌ శేషగిరిరావు కోరారు. ఈమేరకు  ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మిల్లు యాజమాన్యం అసమర్థత, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగానే మిల్లు మూత పడిందన్నారు. కార్మికులకు రావా ల్సిన పీఎఫ్, ఈఎస్‌ఐ బకాయిలు కూడా రాలేదని తెలిపారు. జూట్‌ మిల్లు తెరిపించి కార్మికులను ఆదుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు