ఎస్‌ఐ విద్యార్థిని కొట్టడంతో..

25 Jul, 2019 08:31 IST|Sakshi
ఎస్‌ఐ రమణను నిలదీస్తున్న విద్యార్థులు

విద్యార్థిని ఎస్‌ఐ కొట్టడంపై రోడ్డుపై బైఠాయింపు

అరసాడలో విద్యార్థుల ఆందోళన

సాక్షి, వంగర (శ్రీకాకుళం): మండలంలోని అరసాడ బస్‌స్టాప్‌ వద్ద విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. కొంతమంది విద్యార్థులు మంగళవారం పాసింజర్‌ బస్‌ ఎక్కగా.. స్టూడెంట్‌ స్పెషల్‌ బస్సు ఉండగా పాసింజర్‌ బస్సులో విద్యార్థులు ప్రయాణం చేయడం తగదంటూ ఎస్‌ఐ కొల్లి రమణ వంగరకు చెందిన అలబోను కృష్ణ అనే విద్యార్థిపై  చేయిచేసుకున్నారని విద్యార్థులు ఆందోళన దిగారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి బస్సులను నిలుపుదల చేశారు. ఎటువంటి కారణం లేకుండా కృష్ణను ఎస్‌ఐ కొట్టారని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా ఎస్‌ఐతో పాటు పోలీసు సిబ్బందిని నిలదీశారు.

స్టూడెంట్‌ స్పెషల్‌ బస్సు ఒక్కటే ఉండడంతో పాసింజర్‌ బస్సుల్లో ప్రయాణం తప్పడం లేదని తెలియజేశారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ బస్సుల్లో విద్యార్థులు వేలాడుతూ ప్రయాణాలు చేస్తున్నారని పాలకొండ డిపో మేనేజర్‌ తమ దృష్టికి తీసుకురావడంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. స్టూడెంట్స్‌ స్పెషల్‌ బస్సులు ఉండగా ప్యాసింజర్‌ బస్సులో ఎక్కువ మంది విద్యార్థులు ప్రయాణించడం పట్ల మందలించానని, కావాలని చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే బస్సును మొదటిగా ఆపిన ఎస్‌ఐ వాహనం డ్రైవర్‌ కామేశ్వరరావు క్షమాపణ చెప్పాలని విద్యార్థులు డిమాండ్‌ చేయడంతో ఎస్‌ఐ ఆదేశాల మేరకు బస్సు నిలుపుదల చేశానని, తన వల్ల తప్పు ఉంటే క్షమించాలి అనడంతో విద్యార్థులు శాంతించారు.

మరిన్ని వార్తలు