తల్లికి పునర్జన్మనిచ్చి..

26 Aug, 2018 01:38 IST|Sakshi
నీట మునిగిన కారుని బయటకు తీస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం.వంశీధర్‌ (ఫైల్‌) , అవనిగడ్డ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వంశీధర్‌ తల్లి లక్ష్మి (ఇన్‌సెట్‌లో)

నీట మునిగిన ఎస్సై 

కృష్ణా జిల్లా పాపవినాశనం వద్ద కాలువలోకి బోల్తాకొట్టిన కారు 

ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్‌ఐ గల్లంతు

ఘంటసాల(అవనిగడ్డ): తనకు జన్మనిచ్చిన తల్లికి పునర్జన్మనిచ్చాడు ఓ తనయుడు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాలువలో పడిన కారు నుంచి తల్లిని కాపాడాడు. కానీ తాను మాత్రం నీటి ప్రవాహానికి గల్లంతయ్యి తన వారందరికీ తీరని దుఃఖం మిగిల్చాడు. కృష్ణా జిల్లా పాపవినాశనం వద్దనున్న పంట కాలువలోకి శనివారం ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్‌ఐ కోట వంశీధర్‌ గల్లంతయ్యారు. డీఎస్పీ పోతు రాజు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఇస్మాయేల్‌బేగ్‌ పేటకు చెందిన వంశీధర్‌(30) రామచంద్రపురం ఎస్‌ఐగా పనిచేస్తు న్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి లక్ష్మికి 4 నెలల కిందట గన్నవరంలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో గుండె ఆపరేషన్‌ చేయించాడు.

ఆమెకు వైద్య పరీక్షలు చేయించేందుకు శనివారం రామచంద్రపురం నుంచి కారులో గన్నవరంలోని ఆస్పత్రికి వచ్చాడు. వైద్య పరీక్షల అనంతరం మందులు తీసుకొని.. తల్లితో కలసి ఇస్మాయేల్‌బేగ్‌ పేటకు బయలుదేరాడు. పాపవినాశనం వంతెన వద్దకు వచ్చేసరికి వీరి కారు అదుపు తప్పి.. పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తా కొట్టింది. అప్రమత్తమైన వంశీధర్‌ కారు డోర్‌ తెరిచి తల్లిని నీటిలో నుంచి ఒడ్డుకు చేర్చాడు. స్థానికులు ఆమెని రహదారి మీదకు తీసుకెళ్లగా.. వంశీధర్‌ ఒడ్డుకు ఎక్కే క్రమంలో నీటి ప్రవాహ వేగానికి పట్టుతప్పి మళ్లీ కాలువలోకి పడిపోయాడు. స్థానికులు తాడువేసి కాపాడే ప్రయత్నం చేసేటప్పటికే వంశీధర్‌ నీటమునిగి పోయి గల్లంతయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న అవనిగడ్డ ఎస్‌ఐ మణికుమార్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేశ్‌ ఘటనాస్థలికి చేరుకొని వంశీధర్‌ కోసం గాలించారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ వి.పోతురాజు విజయవాడ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందా న్ని పిలిపించి.. గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కూతవేటు దూరంలో కారు దొరికినప్పటికీ.. వంశీధర్‌ ఆచూకీ మాత్రం లభించలేదు. 

జాతీయస్థాయి క్రీడాకారుడు..  
ఈ ప్రమాదం నుంచి బయటపడిన లక్ష్మి ప్రస్తుతం అవనిగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేశ్, ఆయన సతీమణి ఆస్పత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు. గల్లంతైన వంశీధర్‌.. సింహాద్రి రమేశ్‌కు మేనల్లుడు. జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో రజత పతకం సాధించిన వంశీధర్‌ క్రీడల కోటాలో 2012లో ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం ద్రాక్షారామంలో ఎస్‌ఐగా పనిచేశారు. అక్కడ్నుంచి కాకినాడ టౌన్‌కి బదిలీ అయ్యారు. ప్రస్తుతం రామచంద్రపురం ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు