'తోపులాటలోనే ఎస్సై నేమ్ బ్యాడ్జ్ పడిపోయింది'

5 May, 2015 20:28 IST|Sakshi

అనంతపురం: రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి హత్యాస్థలం వద్ద లభించిన రాప్తాడు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ నేమ్ ప్లేట్ వివాదంపై డీఐజీ బాలకృష్ణ ఎట్టకేలకు పెదవి విప్పారు. హత్యానంతరం అక్కడ జరిగిన తోపులాటను నియంత్రించే క్రమంలోనే ఎస్సై నేమ్ బ్యాడ్జ్ పడిపోయిందని ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. దీంతో పాటు మంత్రి పరిటాల సునీత సెక్యూరిటీని వదిలేశారన్న వార్తలను కూడా డీఐజీ ఖండించారు. మంత్రి సెక్యూరిటీని వదల్లేదని తెలిపారు. ప్రసాద్ రెడ్డి హత్య కేసులో సీఐ శ్రీనివాస్, ఎస్ ఐ నాగేంద్ర ప్రసాద్ లను తొలుత వీఆర్ కు పంపామని.. కేసు దర్యాప్తు కోసమే వారిని తిరిగి యథాస్థానంలో కొనసాగిస్తున్నామన్నారు.

 

వైఎస్సార్ సీపీ నేతలు గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన జనాలను నియంత్రించలేకపోయామన్నారు. ఎస్పీతో సహా, ఇతర పోలీసు అధికారులతో వాదనకు దిగారని.. అందుకే ఐదు కేసులు నమోదు చేశామన్నారు. కాగా, డీజీపీ రాముడిపై ఆరోపణలు తనకు బాధ కలిగించాయన్నారు. డీజీపీని మామ, అన్న అంశాన్ని మరో విధంగా ప్రసారం చేస్తున్నారని.. మామ, అన్న అనడం అనంతపురంలో సహజమేనన్నారు. దత్తత గ్రామాల అభివృద్ధి కోసమే డీజీపీ రాముడు మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారన్నారు.ఇదిలా ఉండగా రాప్తాడులో ఆస్తుల విధ్వంసాన్ని అడ్డుకలేకపోయారన్న ప్రశ్నకు జవాబును మాత్రం డీఐజీ దాటవేశారు.

మరిన్ని వార్తలు