అవినీతి ‘వీరు’నికి ఏసీబీ షాక్

23 Oct, 2014 03:01 IST|Sakshi
అవినీతి ‘వీరు’నికి ఏసీబీ షాక్

 వంగర: అతనికి అవినీతి కొత్త కాదు.. చీకటి దందాలు, సెటిల్‌మెంట్లకు స్టేషన్‌నే వినియోగించుకుంటున్న ఆ అధికారి అవినీతిని సుమారు మూడు నెలల క్రితమే ‘సాక్షి’ ప్రత్యేక కథనం ద్వారా బట్టబయలు చేసింది. అయినా ఏమాత్రం వెరవని అతను మరో అడుగు ముందుకేసి లోక్‌అదాలత్ ఇచ్చినఆదేశాలకే వెల కట్టారు. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. అతనే వంగర ఎస్సై జి.వీరాంజనేయులు. స్వాధీనం చేసుకున్న ఒక బైకును దాని సొంతదారుకు తిరిగి ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
 
 ఎలా జరిగిందంటే..
 ఫిర్యాదుదారు కడుముల సత్యనారాయణ, ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు అందించిన వివరాల ప్రకారం.. అరసాడ గ్రామానికి చెందిన కడుముల శ్రీకాంత్ ఈ ఏడాది జూలై 21న బైక్‌పై వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు సెప్టెంబర్ 29న లోక్‌అదాలత్‌లో  పరిష్కారమైంది. ఆ మేరకు బైక్‌ను బాధితునికి తిరిగి ఇచ్చేయాల్సి ఉంది. బాధితుని తండ్రి సత్యనారాయణ ఎస్సై జి.వీరాంజనేయులును కలిసి బైక్ అప్పగించాలని కోరగా రూ.ఆరువేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 20 రోజులు తిప్పించుకున్నారు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు ఎస్సై ఇంటికి వెళ్లి రూ.5వేలు ఇచ్చారు. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ఏసీబీ అధికారుల దాడి చేసి లంచంగా స్వీకరించిన సొమ్ముతో సహా ఎస్సైని పట్టుకున్నారు. ఆయనప కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ రంగరాజు తెలిపారు. దీనిపై విలేకరులతో మాట్లాడేందుకు ఎస్సై వీరాంజనేయులు నిరాకరించారు. సాయంత్రం ఆరున్నర గంటలకు లైట్లు ఆర్పివేసి చీకట్లో ఎస్సైని ఏసీబీ అధికారులు తరలించారు. ఈ దాడిలో విజయనగరం సీఐలు లక్ష్మోజీ, రామ్మోహన్, ఇద్దరు హెచ్‌సీలు, ఒక కానిస్టేబుల్ పాల్గొన్నారు.
 
 సాక్షి కథనంపై ఆరా
 ఈ సందర్భంగా ఎస్సైపై జూలై 21న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం గురించి ఏసీబీ అధికారులు ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న నెట్ సెంటర్‌కు వెళ్లి ఆరోజు పేపర్ డౌన్‌లోడ్ చేసుకొని పరిశీలించారు. కాపీలు తీసుకున్నారు. ఖాకీ రాజకీయం శీర్షికతో ప్రచురితమైన ఈ కథనం అప్పట్లో సంచలనం సృష్టించింది. జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ ఆదేశాల మేరకు పాలకొండ డీఎస్పీ దీనిప విచారణ జరిపారు. కాగా ఎస్సై పనితీరుపై ఎస్పీ పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు